Mallanna Sagar | నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్.. ఏంటీ ప్రత్యేకతలు?-multiple benefits with mallanna sagar reservoir know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mallanna Sagar | నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్.. ఏంటీ ప్రత్యేకతలు?

Mallanna Sagar | నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్.. ఏంటీ ప్రత్యేకతలు?

HT Telugu Desk HT Telugu
Apr 15, 2022 12:42 PM IST

మల్లన్నసాగర్.. జలశాయం.. తెలంగాణకు నీటి కిరిటం. కాళేశ్వరంలో ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ ఇదే. ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాలను తడిపేందుకు గోదారి జలధారలు వచ్చేవి ఇక్కడి నుంచే. ఇంతకీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటి? ఎప్పుడు మెుదలుపెట్టారు?

<p>మల్లన్నసాగర్</p>
<p>మల్లన్నసాగర్</p>

కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ గుండెకాయ లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కువగా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎత్తైన రిజర్వాయర్ ఇదే. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 8 గ్రామాలు, 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం.. 50 టీఎంసీలు. రిజర్వాయర్‌ చుట్టూ 22.60 కి.మీ.ల దూరం భారీ కట్టను నిర్మాణం చేశారు.

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు గజ్వేల్‌లో 600 ఎకరాల్లో 2,400 ఇళ్లతో సువిశాలమైన కాలనీని నిర్మించారు. ఒక్కొక్కరికి 250 చదరపు గజాల స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ప్రతి ఇంటికీ నల్లా, విద్యుత్తు కనెక్షన్లు ఉంటాయి. ఒకవేళ.. సొంతంగా ఇళ్లను నిర్మించుకుంటామని చెప్పిన వారికి... రూ.5.04 లక్షల చెక్కులు అందించారు. ఉపాధి కోసం రూ.7.50 లక్షల నగదును ప్యాకేజీ రూపంలో ఇచ్చారు.

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం నుంచి తుక్కాపూర్ పంప్ హౌస్ కు గోదావరి జలాలు చేరుతాయి. అక్కడి నుంచి మల్లన్నసాగర్ కు నీటిని ఎత్తిపోస్తారు. ఈ జలాశయం ద్వారా.. ఉమ్మడి మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. సుమారు.. 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ జలాశయానికి 5 (తూములు)స్లూయిజ్ లు ఏర్పాటు చేశారు.

ఈ 5 తూముల నుంచి.. కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి జలాశయానికి.. మిషన్ భగీరథ ద్వారా నీటిని తరలిస్తారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. హైదరాబాద్ తాగునీటికి 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు ఉపయోగిస్తారు.

మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ లో ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా.. రోజూ 0.85 టీఎంసీ నీటిని మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకుంటే.. అందులోని.. 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఈ జలాశయం నుంచే నీటిని అందించేలా ప్లాన్ చేశారు. 7,37,250 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించేలా.. ప్రణాళికలు వేశారు.

జలాశయం పూర్తి సామర్థ్యం..(ఫుల్ రిజర్వాయర్ లెవల్) 557 మీటర్లు. 532 మీటర్ల వరకు అంటే 10 టీఎంసీలు నీటిని నిల్వ చేస్తారు. ఇది డెడ్‌ స్టోరేజీ. 532 మీటర్ల నుంచి 557 మీటర్ల వరకు ఉన్న నీటిని ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. ఇది 40 టీఎంసీలు. మెుత్తం 17,871 ఎకరాలను ఈ రిజర్వాయర్ కోసం సేకరించారు. మెుత్తం కట్ట పొడవు 22.6 కిలోమీటర్లుగా ఉంది.

ప్రత్యేకతలు..

2018లో పనులు మల్లన్నసాగర్ పనులు ప్రారంభం..

పూర్తి నీటి సామార్థ్యం- ( ఫుల్ రిజర్వాయర్ లెవర్ )557 మీటర్లు-50 టీంఎంసీలు

అంచనా వ్యయం-రూ. 7 వేల కోట్లు

భూసేకరణ - 17,871 ఎకరాలు

కట్ట వెడల్పు- 440 మీటర్లు

రిజర్వాయర్ కట్ట పొడవు-22.4 కిలో మీటర్లు

532 మీటర్ల వరకు ( అంటే 10 టీఎంసీలు) నీటి నిల్వ.. ఇది డెడ్ స్టోరేజీ