Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త.. వేధింపులు తట్టుకోలేక తల్లీకూతురు ఆత్మహత్య-mother and daughter committed suicide in siddipet district unable to bear the harassment of her husband ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త.. వేధింపులు తట్టుకోలేక తల్లీకూతురు ఆత్మహత్య

Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త.. వేధింపులు తట్టుకోలేక తల్లీకూతురు ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 02:25 PM IST

Siddipet Tragedy : మద్యానికి బానిసైన భర్త, నిత్యం తాగి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. మనస్థాపం చెందిన భార్య చనిపోదామని నిర్ణయించుకుంది. కూతురు, కొడుకుని తీసుకొని గ్రామశివారులోని బావి వద్దకు వెళ్ళింది. తల్లి కూతురు బావిలో దూకగా.. కొడుకు భయపడి ఊర్లోకి పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

తల్లీకూతురు ఆత్మహత్య
తల్లీకూతురు ఆత్మహత్య

జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్.. సిరిసిల్ల జిల్లాకు చెందిన శారద (35)కు 20 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు స్పందన (14), ఒక కొడుకు రఘువరన్ (9) ఉన్నారు. వీరి కుటుంబం నాలుగు సంవత్సరాల కిందట బెజ్జంకి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. బార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

నిద్రపోతున్న కూతురు, కొడుకుని తీసుకొని..

రాజేశ్వర్ తాగుడుకు బానిసై తరచూ భార్యతో కూతురుతో గొడవపడేవాడు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ పట్టించుకోవడం మానేశాడు. ఇలా అయితే కుటుంబ పరిస్థితి ఏంటని భార్య ప్రశ్నిస్తే.. ఆమెపై చేయి చేసుకునేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా తాగి వచ్చి రాజేశ్వర్ భార్య, కూతురితో గొడవ పడ్డాడు. ఇద్దరిపై చేయి చేసుకున్నాడు. భర్త పెట్టే వేధింపులు భరించలేక శారదా చనిపోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నిద్రపోతున్న కూతురు, కొడుకుని లేపి.. గ్రామా శివారులోని వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. ఈ జీవితం మనకొద్దు ముగ్గురం బావిలో దూకి చనిపోదామని పిల్లలతో చెప్పింది.

శారదా కూతురు చేయి పట్టుకొని బావిలో దూకింది. భయపడిన కొడుకు రఘువరన్ అక్కడి నుండి ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని పక్కింటి వారితో చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లు, జాలర్ల సాయంతో బావిలో తల్లి కూతుర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొదట తల్లి శారదా మృతదేహం, కొన్ని గంటల తర్వాత మధ్యాహ్నం కూతురు స్పందన మృతదేహం లభ్యమైంది.

ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీకూతుర్ల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అమ్మ, అక్క లేరని ఏడుస్తున్న కొడుకు రఘువరన్‌ను చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. స్పందన బెజ్జంకి బాలికల ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతుంది. రఘువరన్ ఐదో తరగతి చదుతున్నాడు.

స్పందన మృతి చెందిన విషయం తెలుసుకున్న తోటి విద్యార్థినిలు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)