MLC Kasireddy Narayan Reddy : బీఆర్ఎస్‍కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా, అదే బాటలో జెడ్పీ వైస్ ఛైర్మన్
MLC Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు మరో కీలక నేత షాక్ ఇచ్చారు. టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
MLC Kasireddy Narayan Reddy : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అధినాయకత్వం బుజ్జగిస్తున్నప్పటికీ… పలువురు నేతలు దారి చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా… తాజాగా మరో ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. ఇందులో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి జడ్పీ వైస్‌ఛైర్మన్ బాలాజీ సింగ్ ఉన్నారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో వీరు భేటీ అయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు.
టికెట్ రాకపోవటంతో అసంతృప్తి….
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. 2018 ఎన్నికల్లో ఆశలు పెట్టుకున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే మరోసారి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఆ తర్వాత రెండోసారి కూడా కసిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే ఈసారి తప్పకుండా తనకే టికెట్ వస్తుందని గట్టిగా భావించారు కసిరెడ్డి నారాయణరెడ్డి. అయితే అనూహ్యంగా మళ్లీ జైపాల్ యాదవ్ కే పట్టం కట్టారు కేసీఆర్. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కసిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అయితే కసిరెడ్డి పార్టీని వీడకుండా ఉండేందుకు స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే హైకమాండ్ బుజ్జగింపు చర్యలు చేపట్టినప్పటికీ…కసిరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా… ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఆయనతో పాటు జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా పార్టీకి రాజీనామా ఇచ్చి… కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
టికెట్ ఎవరికి…?
కసిరెడ్డి పార్టీలో చేరటంతో… కల్వకుర్తి కాంగ్రెస్ రాజకీయం మరో లెవల్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ్నుంచి గతంలో వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఇదే సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఆయనకే టికెట్ ఖరారు అన్న చర్చ ఉంది. ఈ టైమ్ లో కసిరెడ్డి రాకతో సమీకరణాలు మారుతాయా..? టాక్ వినిపిస్తోంది. టికెట్ హామీతోనే కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరారా..? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ టికెట్ హామీతోనే పార్టీలో చేరితే…. వంశీచందర్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది చూడాలి.