Khammam Ganja Chocolates: ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం..3కేజీల చాక్లెట్లు సీజ్-mixture of ganja chocolates in khammam 3 kg chocolates seized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Ganja Chocolates: ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం..3కేజీల చాక్లెట్లు సీజ్

Khammam Ganja Chocolates: ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం..3కేజీల చాక్లెట్లు సీజ్

HT Telugu Desk HT Telugu
Jan 30, 2024 01:20 PM IST

Khammam Ganja Chocolates: ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో భారీగా గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు.

గంజాయి తరలిస్తున్న మహిళల అరెస్ట్
గంజాయి తరలిస్తున్న మహిళల అరెస్ట్

Khammam Ganja Chocolates: ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గంజాయిని తరలిస్తున్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమై బస్సులో తనిఖీలు చేపట్టారు.

రెండు బస్సుల్లో తనిఖీలు జరుపగా ఒక బస్సులో గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. మొత్తం 3 కేజీల గంజాయి చాక్లెట్లతో పాటు 8 కేజీల ఎండు గంజాయిని ఆ మహిళల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒరిస్సా నుంచి ని భద్రాచలం చేరుకున్న మహిళలు రాత్రి భద్రాచలం బస్టాండ్ లో బస చేశారు. మంగళవారం తెల్లవారుజామున భద్రాచలం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సులో ఎక్కారు. వీరిపై అనుమానం కలిగిన తోటి ప్రయాణికులు గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు సమాచారం అందించారు.

ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఖమ్మంలో కాపుకాసి తనిఖీకి సిద్ధమయ్యారు. ఖమ్మం బస్టాండ్ చేరుకున్న ఒక బస్సును బస్టాండ్ లో తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకకపోవడంతో అంతకు ముందే బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్లిన మరో బస్సును అనుమానించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఖమ్మం నగర శివారు కాల్వ ఒడ్డుకు చేరుకున్న ఆ బస్సును నిలిపివేశారు. ఆ బస్సులో తనిఖీ చేయగా ఇద్దరు మహిళల వద్ద గంజాయి చాక్లెట్లు ఎండు గంజాయి కట్టుబడ్డాయి. ఈ ఇద్దరు మహిళలు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పాఠశాలలకు వెళుతున్న చిన్నారులే లక్ష్యంగా వారిని ఆకర్షించి మత్తులోకి దించేందుకు గంజాయి మాఫియా చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించడం అలవాటుగా మార్చుకుంది. ఇటీవలే హైదరాబాద్ నగరంలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు కలకలం రేపాయి.

తాజాగా ఒరిస్సా నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ తరలుతున్న గంజాయి చాక్లెట్లు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు పట్టుబడిన మహిళల వెనక దాగి ఉన్న మాఫియాను గుర్తించేందుకు తీగ లాగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

Whats_app_banner