Medchal News : ఫలించని గోవా, దుబాయ్ ట్రిప్పులు-మేడ్చల్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు మొదలు!-medchal news in telugu brs councilors divided into groups demands no confidence motions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medchal News : ఫలించని గోవా, దుబాయ్ ట్రిప్పులు-మేడ్చల్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు మొదలు!

Medchal News : ఫలించని గోవా, దుబాయ్ ట్రిప్పులు-మేడ్చల్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు మొదలు!

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 10:44 PM IST

Medchal News : మేడ్చల్ పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి తారాస్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు.

మేడ్చల్ లో తారాస్థాయికి బీఆర్ఎస్ కౌన్సిలర్ల అసమ్మతి
మేడ్చల్ లో తారాస్థాయికి బీఆర్ఎస్ కౌన్సిలర్ల అసమ్మతి

Medchal News : మేడ్చల్ నియోజవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. గత నవంబర్ 1 వరకు ఏకతాటిపై ఉన్న బీఆర్ఎస్ నేతల్లో నెలకొన్న అసమ్మతి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బయటపడింది. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 7 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా... అందులో 2 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో మేడ్చల్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ లో పలువురు కౌన్సిలర్లు చేరడం, మరికొందరు బీఆర్ఎస్ లో ఉంటూ.. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుండడంతో మేడ్చల్ జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీలో అసమ్మతితో ఉన్న వారిని శాంతపరిచేందుకు కౌన్సిలర్లను మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి విహార యాత్రలకు సైతం తీసుకెళ్లినా అవి సఫలం కాలేదనే చెప్పాలి. గోవా, దుబాయ్ వంటి ప్రాంతాలకు తమ కౌన్సిలర్లను శాంత పరిచేందుకే విహారయాత్రలకు తిప్పుతున్నానని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వయంగా ప్రకటించారు. మల్లారెడ్డి పట్టు కోల్పోకుండా తన ప్రయత్నాలు చేస్తున్నా....అసమ్మతి జ్వాలలు మాత్రం ఆగడం లేదు.

పీర్జాదిగుడా, జవహర్ నగర్ లో

మూడు కార్పొరేషన్లలో రెండింటా అసమ్మతి జోరుగా నడుస్తుంది. మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడలో గత 15 రోజులుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా విడిపోయి మేయర్ ను కుర్చీ నుంచి దించడానికి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. పీర్జాదిగూడలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటాపోటీగా రాజకీయాలు నడిపిస్తున్నారు. కార్పొరేటర్లు సైతం విడిపోయి క్యాంపుల్లో ఉంటూ రాజకీయం చేస్తున్నారు. ఇటు జవహర్ నగర్ లో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయి ఈనెల 19 అవిశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

నాగారం, తూముకుంటలో

నాగారం పురపాలక సంఘం బీఆర్ఎస్ ఛైర్మన్ చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ మల్లేష్ యాదవ్ పై 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు అవిశ్వాస నోటీసులు అందజేశారు. నాగారం మున్సిపాలిటీలోని మొత్తం 20 మంది కౌన్సిలర్లలో 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రంపై సంతకాలు చేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ, 10 మంది బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. నాలుగేళ్లుగా తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే ఆగ్రహంతో అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఛైర్మన్ ,వైస్ ఛైర్మన్లు కేవలం పదవులు అనుభవించడానికే ఉన్నారని, అందుకే వీరికి అవిశ్వాసంతో అడ్డుకట్ట వేయాలని మూకుమ్మడిగా ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇటు మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస జ్వాలలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు అసమ్మతి కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రస్తుతం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను తప్పించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ను కోరారు. తూముకుంట మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టరకు వినతి పత్రం అందజేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం