Medak News : గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి-medak ganesh nimajjanam tractor cleaning youth drowned in pond died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak News : గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

Medak News : గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

HT Telugu Desk HT Telugu
Sep 15, 2024 08:03 PM IST

Medak News : మెదక్ జిల్లాలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి వెళ్లిన యువకుడు చెరువులో కాలు జారీ పడి మృతి చెందాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలం అవంఛ గ్రామంలో చోటుచేసుకుంది.

గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి
గణేష్ ఉత్సవాల్లో అపశృతి- ట్రాక్టర్ కడగడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

Medak News : మెదక్ జిల్లాలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం ట్రాక్టర్ ను కడగడానికి వెళ్లిన ఓ యువకుడు చెరువులో కాలు జారి గుంతలో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని అవంఛ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో శ్రీనివాస్ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

ట్రాక్టర్ కడగడానికి వెళ్లి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవంఛ గ్రామానికి చెందిన గంట శ్రీనివాస్ (24) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిమజ్జనం కోసం గ్రామంలోని పెద్ద చెరువులో స్నేహితులతో కలిసి శ్రీనివాస్ ట్రాక్టర్ కడగడానికి వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్ కడుగుతుండగా కాలు జారి ప్రమాదవశాత్తు మట్టి కోసం తీసిన గుంతలో పడి మునిగిపోయాడు. వెంటనే గమనించిన స్నేహితులు, గ్రామస్థులు వెతికి బయటకు తీశారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందాడు.

శ్రీనివాస్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా ... తల్లి భుమామ్మతో కలిసి నివసిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లి భుమామ్మ రోదనలు మిన్నంటాయి. వృద్ధాప్యంలో తనకు ఎవరు దిక్కు అంటూ తల్లి విలపిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

మెదక్ లో మరో ఘటన

ఆటో డ్రైవర్ గా విధులు నిర్వర్తించుకొని ఇంటికి వస్తుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి ప్రభాకర్ (45) వ్యవసాయం చేసుకుంటూ, ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆటో తీసుకొని వెళ్లి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో మెదక్- నర్సాపూర్ జాతీయ రహదారిపై ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెదక్ పట్టణానికి చెందిన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని, కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రభాకర్ కు భార్య అమృత, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మృతుడి భార్య అమృత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.