Karimnagar: దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మహాశక్తి ఆలయం, వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు-mahashakti temple is a ready for devi navratri celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar: దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మహాశక్తి ఆలయం, వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు

Karimnagar: దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మహాశక్తి ఆలయం, వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 06:14 AM IST

Karimnagar: కరీంనగర్ లో ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. అక్టోబర్ 3 నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ సహా వందలాది మంది భక్తులు భవాని దీక్షలు తీసుకున్నారు.

నవరాత్రులకు సిద్ధమైన కరీంనగర్ మహాశక్తి ఆలయం
నవరాత్రులకు సిద్ధమైన కరీంనగర్ మహాశక్తి ఆలయం

Karimnagar: మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవారులు కొలువైన కరీంనగర్ చైతన్యపురికాలనీలోని మహాశక్తి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువలా నిర్వహించే పనిలో ఆలయ నిర్వాహకులు నిమగ్నమయ్యారు.

జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో అక్టోబర్ 3 నుండి12 వరకు దేవీ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు. విజయ దశమి దసరా వరకు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

భక్తులకు కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే రహదారులను ఆకర్షణీయమైన విద్యుద్దీపాల వెలుగులతో విరజిమ్మేళ శోభాయమానంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది.

ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి మహాశక్తి దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం..

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. అక్టోబర్ 3న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా, 4న శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా, 5న శ్రీ అన్నపూర్ణ (చంద్ర ఘంట) దేవిగా, 6న శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ )గా, 7న మహాచండీ దేవి (స్కంద మాత)గా, 8న శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని)గా, 9న శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి)గా,10న దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ)గా, 11న శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి)గా, విజయ దశమి పర్వదినమైన 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సహా పలువురు భవానీ దీక్షలు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు వందలాది మంది భక్తులు భవానీ దీక్ష చేపట్టారు. విజయదశమి దసరా వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు.

బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం 14వ సారి. మహాశక్తి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ ‘భవానీ దీక్ష’ చేపట్టారు. అధ్యాత్మకంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ సమానమనే ఉద్దేశ్యంతో భవానీ దీక్షను ప్రోత్సహిస్తున్నారు.

బండి సంజయ్ నిత్యం బిజీగా ఉన్నా 11 రోజులు మాత్రం భవానీ దీక్ష చేస్తున్న భక్తులతో మమేకమై ఆలయంలోనే అమ్మవారిని సేవిస్తూ నిత్య పూజలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు భవానీ దీక్ష చేపడుతున్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సైతం వారితో కలిసి భోజనం చేస్తారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner