Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి-macherla esobu alias jagan died in an encounter in chhattisgarh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి

Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి

HT Telugu Desk HT Telugu
Sep 05, 2024 06:16 AM IST

Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీ తొలి తరం నేత.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసిన ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు(70) హతమయ్యారు. చత్తీస్ గడ్ ప్రజలకు జగన్‌గా,రణదేవ్ దాదాగా సుపరిచితుడైన దాదా దంతెవాడ,బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్‌గడ్ ఎన్‌ కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మాచర్ల ఏసోబు అలియాస్ దాదా
ఛత్తీస్‌గడ్ ఎన్‌ కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మాచర్ల ఏసోబు అలియాస్ దాదా

Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీ తొలి తరం నేత.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసిన ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు(70) పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రజలకు జగన్ గా, రణదేవ్ దాదా సుపరిచితుడైన ఆయన మంగళవారం దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఆయన 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర పడగా.. ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల పురిటి గడ్డగా పేరున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతోమందికి విప్లవ పాఠాలు నేర్పిన ఏసోబు అస్తమించడం పట్ల వివిధ ప్రజా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

50 ఏళ్లకు పైగా ఉద్యమ పోరాటం

టేకులగూడెం గ్రామానికి చెందిన మాచర్ల ఏసోబు చిన్నతనం నుంచే విప్లవ భావాలతో పెరిగాడు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు కాగా.. స్థానికంగా 8వ తరగతి వరకు చదివిన ఆయన.. 1974లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 1978లో రైతు కూలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై.. రైతు కూలి ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. ఆ తరువాత 1985లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత ఎంతోమందికి ఉద్యమ పాఠాలు నేర్పించాడు. ఆ తరువాత ఓరుగల్లులో వివిధ స్థాయిల్లో పని చేశాడు.

మొదట అన్నసాగర్ దళ కమాండర్ గా, చేర్యాల, స్టేషన్ ఘన్ పూర్ దళ కమాండర్ గా కూడా పని చేశాడు. ఆయనలో పట్టుదల, ఉద్యమ పటిమను గుర్తించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆ తరువాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, పార్టీ మాజీ సెక్రటరీ గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండర్ గా బాధ్యతలు అప్పగించింది.

ఆ తరువాత పార్టీ కేంద్ర మిలిటరీ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కాగా.. ఆ తరువాత మహారాష్ట్ర–ఛత్తీస్ గడ్ బార్డర్ ఇన్ఛార్జ్ గా, ఛత్తీస్ గడ్ మిలిటరీ కమిటీ ఇన్ఛార్జ్ గా పార్టీ నియమించింది. దళాన్ని పటిష్టం చేయడంతో పాటు వివిధ పోరాటాల్లో ముందుండి నడిపించడంలో ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా కీలకంగా వ్యవహరించేవాడు. మావోయిస్టు పార్టీలో 1974 నుంచి 2024 వరకు పని చేసిన ఆయన.. ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర పడినట్లయ్యింది.

భార్య లక్ష్మక్క కూడా..

మాచర్ల ఏసోబు భార్య లక్ష్మక్క కూడా కొంతకాలం దళంలో పని చేసింది. 1965 సుమారులో ఏసోబు, లక్ష్మక్కకు వివాహం జరగగా.. వారికి ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కొడుకు పుట్టాడు. నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే భార్య లక్ష్మక్క ను తీసుకుని ఏసోబు అడవి బాట పట్టాడు. ఇదిలాఉంటే కొంతకాలం దళంలో పని చేసిన లక్ష్మక్క ఆ తరువాత ఉద్యమాలకు స్వస్తి చెప్పింది.

దళం నుంచి బయటకు వచ్చి ధర్మసాగర్ మండల కేంద్రానికి మకాం మార్చింది. అక్కడే ఉంటూ పిల్లలను చదివించి, పెంచి పెద్ద చేసింది. తన చేతుల మీదుగా పిల్లలందరి పెళ్లిళ్లు కూడా చేసింది. ఇరెండేళ్ల కిందట లక్ష్మక్క తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. ఆసుపత్రి పాలైంది. ఆ తరువాత చికిత్స తీసుకోగా.. ఏడాదిన్నర కిందట గుండెపోటుతో మరణించింది.

నేడు టేకులగూడెంలో అంత్యక్రియలు

ఉద్యమాల ముద్దుబిడ్డ ఏసోబు దంతెవాడ ఎన్ కౌంటర్ లో చనిపోగా.. ఆ సమాచారాన్ని అక్కడి ఎస్పీ గౌరవ్ రాయ్ మొదట వరంగల్ పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఏసోబు కుమారుడైన మహేష్ చంద్రకు కూడా సమాచారం చేరవేశారు. దీంతో ఏసోబు మరణ వార్త తెలియడంతో టేకులగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఏసోబు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు మహేష్ చంద్ర, ఆయనకు దగ్గరి బంధువులు మరోఇద్దరు కలిసి బుధవారం మధ్యాహ్నం దంతెవాడకు బయలు దేరారు. అక్కడ పోలీస్ అధికారులు ఏసోబు మృతదేహాన్ని అప్పగించిన అనంతరం గురువారం ఉదయం డెడ్ బాడీని టేకుల గూడెం గ్రామానికి తీసుకుని రానున్నారు.

గురువారం సాయంత్రం వరకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా ఉద్యమాల వీరుడిగా పేరున్న ఏసోబు మరణం పట్ల వివిధ ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)