Cheetah in Sangareddy District : హెటిరో యూనిట్ లోకి చిరుత.. పరుగులు పెట్టిన కార్మికులు
Hetero Pharma unit in Sangareddy: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత కనిపించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. మరోవైపు లోపలికి వెళ్లిన చిరుత అటవీ అధికారులకు చిక్కింది.
Leopard Enter into Hetero Pharma Unit:సంగారెడ్డి జిల్లాలోని ఓ పారిశ్రామిక యూనిట్ లోకి చిరుత వెళ్లటం కలకలం రేగింది. తెల్లవారుజాము యూనిట్ లోపలికి వెళ్లిన చిరుతను చూసిన కార్మికులు పరుగులు పెట్టారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో చిరుత కలకలం రేపింది. తెల్లవారుతున్న సమయంలో చిరుత హెటిరో పరిశ్రమలోని ఓ బ్లాక్ లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు పెట్టారు. చిరుత బయటికి రాకుండా బయటికి వచ్చే ద్వారాలు మూసేశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు కంపెనీలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. చిరుత సంచారం దృశ్యాలు ల్యాబ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
చిరుతను బంధించేందుకు జిల్లా అటవీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. గన్ ద్వారా మత్తు మందు ఇచ్చి.. బోనులో బంధించారు. తర్వాత దాన్ని జూకి తరలించారు. చిరుతపులి ఆ బ్లాక్‌లో దాదాపు 10 గంటలు ఉండగా... రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 3 గంటలు కొనసాగింది. మొత్తంగా ఎవరికీ ఎలాంటి సమస్యా లేకుండా చిరుత బోనులో చిక్కింది.
చిరుత రావటం ఇదేతొలిసారి కాదని... మూడు నెలల క్రితం కూడా కంపెనీలో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అయితే ఈ చిరుత నర్సాపూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గత నవంబర్ నెలలో నర్సాపూర్ మండల పరిధిలో రెండు ఆవులను చిరుత చంపేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఈ హెటిరో యూనిట్ ఉంది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీసీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఒకటి, రెండు కాదు..గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇటీవల భీంపూర్ మండలం గుంజాల దగ్గర పులుల గుంపు స్థానికుల కంట పడింది. తాజాగా కాగజ్‌నగర్ కారిడార్‌లో కెమెరాకు చిక్కింది మూడు చిరుతల గుంపు. కొమురం భీమ్ జిల్లాలో వారం రోజుల పాటు వణికించింది. అయితే అది ప్రాణహిత దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఆ తర్వాత కూడా చాలాచోట్ల చిరుతలు కంటపడుతూనే ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.