Munugodu: మునుగోడులో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్... సమీకరణాలు మారేనా..?-leaders joining in other parties at munugodu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu: మునుగోడులో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్... సమీకరణాలు మారేనా..?

Munugodu: మునుగోడులో జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్... సమీకరణాలు మారేనా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 17, 2022 06:26 AM IST

Munugodu politics: మునుగోడులో జంపింగ్ జపాంగ్ లు పెరుగుతున్నాయి. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా మునుగోడు రాజకీయం... రసవత్తరంగా మారుతోంది.

మునుగోడులో జంపింగ్ జపాంగ్
మునుగోడులో జంపింగ్ జపాంగ్

Munugodu bypoll 2022: మునుగోడు... ఇప్పుడు ప్రధాన పార్టీలకు అతి పెద్ద సవాల్..! కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్లే... ఏ మాత్రం తేడా కొట్టినా... పరిస్థితి తలకిందులే..! ఈ పరిస్థితే... ప్రధాన పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది... అంతేనా పరుగులు పెట్టిస్తోంది.! ఓ పార్టీ ప్లాన్ వేస్తే... మరోవైపు ఉన్న పార్టీలు ప్రతివ్యూహాన్ని రచించే పనిలో పడుతున్నాయి. పక్క పార్టీల్లోని లీడర్లకు గాలం వేస్తే... మరో పార్టీ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ సవాల్ విసురుతోంది. ఇంకేముంది మునుగోడులో జంపింగ్ జపాంగ్ ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విషయంలో టీఆర్ఎస్...టాప్ గేర్ వేసే ముందుకెళ్తే.... అలర్ట్ అయిన బీజేపీ కూడా రేస్ లో స్పీడ్ పెంచేస్తోంది. అధికార పార్టీ నుంచి నేతలను ఆకర్షిస్తోంది. ఈ లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం... వెనకబడిపోయింది. మారుతున్న నేతలందరూ కూడా ఆ పార్టీకి చెందినవారే కావటంతో... అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుతోంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందటంతో మునుగోడులో పరిస్థితి మారిపోయింది. షెడ్యూల్ రాకముందే... అన్ని పార్టీలు గ్రౌండ్ లోకి దిగాయి. ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరికతో సమరశంఖం పూరించే ఏర్పాట్లలో ఉంటే... అంతకుముందే టీఆర్ఎస్ సభతో సవాల్ విసిరాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ చండూరు సభతోనే ఎంట్రి ఇచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం...కాస్త స్పీడ్ ను పెంచిందనే చెప్పాలి. అభ్యర్థి విషయంలోనూ సుదీర్ఘ కసరత్తు చేస్తూనే.... పక్క పార్టీ లీడర్లపై ఫోకస్ పెట్టింది. గల్లీ లీడర్ల నుంచి... ప్రజాప్రతినిధుల వరకు ఆకర్ష్ వల విసురుతోంది. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడును చుట్టుముట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్ లకు టీఆర్ఎస్ కండువా కప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు చేరిపోయారు. మరికొందరిపై నజర్ పెట్టారు.

బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు..

ఇదిలా ఉంటే... రాజగోపాల్ రెడ్డి కూడా అలర్ట్ అయిపోతున్నారు. తన కేడర్ తో పాటు ఆయన వెంట నడిచిన నాయకులను చేజారిపోకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కీలకమైన పట్టణంగా ఉన్న చౌటుప్పల్ ఎంపీపీని బీజేపీలోకి వచ్చేలా చేశారు. ఆయనతో పాటు మాజీ జెడ్పీటీసీ, పలువురు నేతలు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కమలం పార్టీలోకి వచ్చేశారు. ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. పార్టీలో చేరిన తాడూరి వెంకట్ రెడ్డి... 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉండి మంచి ఓట్లను కూడా సంపాదించారు. నియోజకవర్గంలో ఆయనకంటూ ఓ వర్గం కూడా ఉంది. కాంగ్రెస్ లో ఎంపీపీగా గెలిచిన ఆయన... టీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేస్తున్న వెంకట్ రెడ్డి.... బీజేపీలో చేరటంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

టార్గెట్ కాంగ్రెస్…!

మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు చేరిపోయిన వారిలో ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ఏ ఒక్క పార్టీ నేత కూడా... హస్తం గూటికి చేరలేదు. నేతలు చేజారిపోతుండటంతో కాంగ్రెస్ నాయకత్వం... అప్రమత్తమైంది. మండలాల వారీగా ఇంఛార్జ్ లను ప్రకటిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానిక నేతలు పార్టీ నుంచి చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా నేతలు... గ్రౌండ్ లో ల్యాండ్ అయిపోయారు. ఇక 20 తరువాత పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా... మునుగోడులోనే ఉంటానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. కేడర్ కు భరోసా ఉంటానని... నేతలు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ కూడా... మండలాల వారీగా ఎమ్మెల్యేలకు కేటాయించింది. వారు కూడా... స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూనే... పక్క పార్టీ నేతలతో చర్చలు జరిపే పనిలో పడ్డారు. పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక రేపోమాపో బీజేపీ నాయకత్వం కూడా... మునుగోడులో మోహరించే అవకాశం ఉంది.

ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు గడ్డపై మోహరిస్తుండటంతో పొలిటికల్ హీట్ రోజురోజూ పెరిగిపోతుంది. దీనికితోడు లోకల్ లీడర్లతో పాటు ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటంతో... గంటల వ్యవధిలోనే సీన్ మారిపోతుంది. ప్రస్తుతం శాంపిల్ మాత్రమేనని... రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయంటూ టీఆర్ఎస్, బీజేపీలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ సవాల్ విసిరితున్నాయి. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటంతో… ఆయా పార్టీలో డిఫెన్స్ లో పడిపోతున్నాయి. అయితే నేతలు వెళ్లినంతమాత్రన పార్టీకి వచ్చే నష్టం లేదని… కార్యకర్తలు అంతా పార్టీతోనే ఉన్నారనే వాదన వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ లు ఇలా పార్టీలు మారితే… ప్రధాన పార్టీల సమీకరణాలు మారనున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా షెడ్యూల్ కంటే ముందే మునుగోడు రాజకీయం కుతకుత ఉడికిపోతుండటంతో... రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

IPL_Entry_Point