Medico Preethi Suicide :కావాలనే ప్రీతిని వేధించిన సైఫ్
Medico Preethi Suicide వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ అనస్తీషియా విద్యార్ధిని ప్రీతిని సీనియర్ రెసిడెంట్ సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించినట్లు ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ధారించింది. సైఫ్ వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
Medico Preethi Suicide సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ ఫస్టియర్ అనస్థీషియా విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని విచారణ కమిటీ నిర్ధారించింది.
నేషనల్ మెడికల్ కౌన్సిల్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 16న హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రివెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన వాగ్వాదమే ఇద్దరి మధ్య వివాదానికి కారణమని కమిటీ నిర్ధారించింది. గొడవను మనసులో పెట్టుకుని తనను ప్రశ్నించిన ప్రీతికి ఎవరూ సహకరించ వద్దంటూ పీజీ విద్యార్థుల గ్రూప్‌లో సైఫ్ పోస్టు పెట్టాడని, ఆమెను వేధించాలని సైఫ్ తన సహ విద్యార్థిని ప్రోత్సహించాడని కమిటీ నిర్ధారించింది. ప్రీతి వ్యవహారంలో సైఫ్‌య వ్యవహారంలో వాట్సాప్ చాట్‌లను పోలీసులు వెలికి తీయడంతో వేధింపులపై పక్కా ఆధారాలు లభించాయి.
ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడానికి సీనియర్ విద్యార్థి సైఫ్, ప్రీతిలకు ఇచ్చిన కౌన్సెలింగ్‌లో ఏం జరిగిందనే విషయం అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డిని కమిటీ సమావేశానికి పిలిపించి విచారించారు. సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసిందని, ఒక దశలో కన్నీళ్లు పెట్టుకుందని నాగార్జున రెడ్డి వివరించారు. ఆ తర్వాత సైఫ్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చానని తెలిపారు. సైఫ్ వేధింపులు, తనకు ఎవరూ అండగా లేరనే నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని కమిటీ నిర్ధారించింది. వేధింపులు కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయని అభిప్రాయపడింది.
మరోవైపు ప్రీతి కేసులో వరంగల్ మట్టెవాడ పోలీసులు రిమాండు రిపోర్టు విడుదల చేశారు. అనస్థీషియా పీజీ విద్యార్థుల నాకౌట్స్ వాట్సప్ గ్రూప్‌లోని మొత్తం 17 స్క్రీన్‌షాట్లను సేకరించినట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. సైఫ్ పలు మార్లు ప్రీతిని వేధించినట్టు, పీజీలో సీటు రిజర్వేషన్‌పై రావడం వల్ల ప్రీతికి విషయ పరిజ్ఞానం లేదని సైఫ్ పలు సందర్భాల్లో దూషించినట్టు నివేదికలో పొందు పరిచారు. సీనియర్‌గా ప్రీతికి తాను మార్గదర్శనం చేస్తున్నాననే సాకుతో సైఫ్ వేధింపులకు గురిచేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ప్రీతి ఆత్మహత్య కేసులో సమగ్ర విచారణ కోసం నిందితుడు సైఫ్‌ను పోలీసు కస్టడీకి ఇస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించింది. ఈ కేసులో సైఫ్‌ను మరింత లోతుగా విచారించేందుకు వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసుకున్న దరఖాస్తును స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర విచారించారు. నిందితుడిని నాలుగు రోజుల కస్టడీకి అనుమతించారు. మరోవైపు సైఫ్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రీతి ఆత్మహత్యకు తాను కారణం కాదని, తనకెలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పు చేయనందున బెయిల్ ఇవ్వాలంటూ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో ఫిబ్రవరి 28న దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ దరఖాస్తు ఈ నెల 7న విచారణకు రానుంది.