Chintapalli Siberian Cranes : చింతపల్లి చుట్టాల జాడేది- రెండేళ్లుగా కనిపించని సైబీరియా కొంగల సందడి
Chintapalli Siberian Cranes : చింతపల్లి చుట్టాలైన సైబీరియా కొంగలు గత రెండేళ్లుగా ముఖం చాటేస్తున్నాయి. పచ్చని పంటపొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపుతున్న తరుణంలో చింతపల్లి రూపురేఖలు మారిపోయాయి. దీంతో సైబీరియా కొంగల రాక తగ్గిపోయింది.
Chintapalli Siberian Cranes : నాగరికత మాటున జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఈ విశ్వంలో అనేక రకాల జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా చూరుస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. వేకువ జామున పక్షుల కిలకిలారావాల చప్పుళ్లు క్రమంగా తగ్గిపోతున్న వైనం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక అభివృద్ధి చాటున పచ్చని పంట పొలాలు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కనుమరుగవుతున్న దుస్థితి కళ్లకు కనిపిస్తూనే ఉంది. హైవే రోడ్ల పేరుతో వందల ఏళ్ల వయసున్న భారీ వృక్షాలను నిలువునా కూల్చేస్తూ పక్షి వాలడానికి కూడా చోటు లేకుండా చేస్తున్నాం. అలాగే దశాబ్దంన్నర కిందట రోడ్ల వెంట విరాజిల్లిన పచ్చని పంట పొలాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. ఊళ్ల చుట్టూ ఉండే అడవులు సైతం అంతరించిపోతున్న దుస్థితితో అక్కడి జంతుజాలం ఊళ్లపైకి దండెతుతున్న వైనం చూస్తున్నాం.
గత రెండేళ్లుగా ముఖం చాటేస్తున్న సైబీరియా కొంగలు
తాజాగా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో ప్రతి ఏటా వేసవిలో సందడి చేసే సైబీరియా కొంగలు గడిచిన రెండేళ్లుగా ముఖం చాటేస్తున్నాయి. గడిచిన 50 ఏళ్లుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఊరికి వచ్చే కొంగలు ఈసారి కూడా రాకపోవడం వెనుక అనేక రకాల కారణాలను చర్చించుకున్నప్పటికీ వీటన్నింటి వెనుక ప్రకృతి సమతుల్యతలో వ్యత్యాసం చోటుచేసుకోవడమే అసలు కారణంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చింతపల్లి గ్రామం అనాదిగా వ్యవసాయాధారిత పల్లెగా వర్ధిల్లుతోంది. ఇక ఈ ఊరి నిండా చింతచెట్లు విరివిగా ఉండేవి. అందుకే ఈ ఊరికి చింతపల్లి అనే పేరు వచ్చిందని గ్రామవాసులు చెబుతుంటారు. ఈ చెట్లతో పాటు గ్రామానికి నలు దిక్కులా తివాచీ పరిచినట్లు పచ్చని పంట పొలాలు విరాజిల్లేవి. అలాగే ఇక్కడికి సమీపంలోనే ఉండే చెరువులు, కుంటలు ఈ పక్షులు చింతలేకుండా జీవించేందుకు కావాల్సిన వనరులను ఏర్పరచేవి. ఇలాంటి వనరులున్న చింతపల్లికి ప్రతీ ఏటా జనవరి నెలలో రష్యాలోని ఒక ప్రాంతమైన సైబీరియా నుంచి వేలాదిగా కొంగలు తరలివచ్చేవి.
పైలెట్ కొంగలు పరిస్థితి పసిగట్టాయా?
గడిచిన ఐదు దశాబ్దాలుగా ఈ చింతపల్లి గ్రామం సైబీరియా కొంగలకు ఆవాసాన్ని కల్పిస్తోంది. తొలుత డిసెంబర్ నెలలోనే కొన్ని కొంగలు ఈ గ్రామ పరిసరాలకు చేరుకుని ఇక్కడి అనుకూలతలు, ప్రతికూలతలను చూసుకుని వెళ్లేవి. ఎప్పట్లాగా వీటి ఆవాసానికి డోకాలేదని భావిస్తే అవి మిగతా కొంగలకు గ్రీన్ సిగ్నల్ అందించేవి. ముందుగా వచ్చేవి కాబట్టి వీటిని పైలెట్ కొంగలు అని కూడా సంబోధించేవారు. ఇక ఆ తర్వాత గుంపులు, గుంపులుగా సైబీరియా కొంగలు కొన్ని వేల సంఖ్యలో ఈ పల్లెకు నేరుకునేవి. వచ్చీరాగానే చింత చెట్ల చిటారు కొమ్మలను వెతుక్కుని ఆ కొమ్మల్లో గూళ్లను ఏర్పాటు చేసుకుని అవాసానికి సిద్ధం చేసుకుంటాయి. ఇలా వచ్చిన కొంగలు ప్రతి రోజూ ఆహారం వేటకు సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లివచ్చేవి. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ తో పాటు ఇక్కడికి సమీపంలో ఉండే పెద్ద చెరువుల్లో చేపల వేటకు వెళ్లేవి. ఇలా నివసిస్తూ ఆ గూళ్లలో గుడ్లను పెట్టి పొదిగేవి. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకూ వాటి అలనాపాలనా చూసుకుంటూ నివశించేవి. తొలకరి వర్షాలు పడే సమయం వరకూ అంటే జూన్ ప్రవేశం వరకు ఉండి ఆ తర్వాత వాటి పిల్లలతో కలిసి సైబీరియాకు బయలుదేరి వెళ్లేవి. ఇలా ప్రతీ ఏటా వచ్చి వెళ్లే కొంగలు ఈ గ్రామ ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారాయి. ఇవి వస్తే గ్రామానికి శుభం జరుగుతుందని, రాని సంవత్సరాల్లో కరువు కాటకాలు తాండవించి అశుభం కలుగుతుందని విశ్వసించేవారు.
ముఖం చాటేయడానికి కారణాలివే..
ఎప్పట్లాగే డిసెంబర్ నెలలో వచ్చిన పైలెట్ కొంగలు తిరిగి వెళ్లి మళ్లీ ఒక్క కొంగను కూడా తోడ్కొని రాలేదు. అయితే గడిచిన ఐదు దశాబ్దాలుగా వేసవి బంధువుల్లా వచ్చి విడిది చేసి వెళుతున్న సైబీరియా కొంగలు గడిచిన రెండేళ్లుగా రాకపోవడానికి అనేక కారణాలను చర్చించుకుని ముక్కున వేలేసుకోవాల్సిన తరుణం వచ్చేసింది. పైలెట్ కొంగలు వచ్చి వెళ్లాక ఎప్పుడూ గుంపులు, గుంపులుగా వచ్చే కొంగలు ఈసారి ఎందుకు రాలేదు.? అంటే తొలుత వచ్చిన పైలెట్ కొంగలు ఇక్కడ వాటి ఆవాసానికి ఎప్పట్లాగా అనుకూల పరిస్థితులు లేవన్న విషయాన్ని గమనించినట్లేనన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. పైలెట్ కొంగలు చింతపల్లి గ్రామంలో ఎన్నడూ లేనంతగా అంతటి ప్రతికూలతలను ఏం గమనించాయన్నదే చర్చనీయాంశం ఇప్పుడు విషయానికొస్తే.. చెరువుల నిండా నీళ్లు పుష్కలంగా కళకళలాడుతున్నా మునుపటిలా ఊరి చుట్టూ పచ్చని పంట పొలాలు మాత్రం లేనేలేవు. ఊరికి నలుదిక్కులా గ్రీన్ కార్పెట్ పరిచినట్లుండే పంట పొలాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోవడాన్ని స్వయంగా మనందరం చూస్తూనే ఉన్నాం.
రియల్ ఎస్టేట్ ప్రభావం
జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న ఖమ్మం రూరల్ మండలంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో పచ్చని పొలాల్లో రియల్ చిచ్చు రాజుకుంది. ఫలితంగా పంటలు పండే పచ్చని పొలాలు క్రమంగా కనుమరుగయ్యాయి. మరో ప్రధాన కారణం ఏంటంటే విపరీతమైన కోతుల బెడద. గ్రామాలకు వెలుపల అటవీ సంపద కుంచించుకుపోతున్న నేపథ్యంలో అడవులనే ఆవాసాలుగా చేసుకొని జీవించే కోతులు, ఇతర జంతువులు ఆహారం కోసం అనివార్యంగా ఊళ్లపై పడే పరిస్థితి ఏర్పడింది. ఇది అన్ని చోట్లా జరుగుతున్న తంతే కావడం గమనార్హం. పక్షులు చెట్లపై ఏర్పాటు చేసుకున్న గూళ్లను ధ్వంసం చేసి చిన్నాభిన్నం చేయడంలో కోతులు అరితేరిన ప్రతిభను కనబరుస్తాయి. పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని కూడా కొంగలు పసిగట్టాయి. సైబీరియా కొంగలు ముఖం చాటేయడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
క్వారీల ప్రభావం
అలాగే ప్రకృతి అసమతుల్యతకు మరో కారణం చెట్ల నరికివేత. గతంలో పచ్చని చింత చెట్లతో విరాజిల్లిన చింతపల్లి గ్రామం ఇప్పుడు చింత చెట్లే లేక బోసిబోతోంది. గ్రామం నామకరణానికి కారణమైన చెట్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఏ విషయంలోనైనా "గతమెంతో ఘనం" అని చెప్పుకున్నట్లుగా గడిచిన పదేళ్ల కిందటి వాతావరణ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లేనేలేదని చెప్పాలి. పూర్తిగా చింతచెట్లపైనే ఆవాసాలను ఏర్పరచుకుని జీవించే సైబీరియా కొంగలు ఆ చెట్లే కనుమరుగైన దుస్థితితో ముఖం చాటేసిన తీరు స్పష్టమవుతోంది. వీటికితోడు బ్లాస్టింగ్ చప్పుళ్లు కూడా మరో కారణంగా తెలుస్తోంది. వెంచర్లలో బండ రాళ్లను పగలగొట్టేందుకు చట్టుపక్కల ఏర్పడిన క్వారీల్లో రాళ్లను వెలికితీసేందుకు బాంబ్ బ్లాస్టింగ్ లు నిత్యకృత్యంగా మారాయి. పక్షులు చప్పుళ్ల మధ్య నివశించలేవన్న విషయం మనందరికీ తెలుసు. ఇలాంటి పరిణామాలు సైబీరియా కొంగల చరిత్రాత్మక పర్యటనకు ఫుల్ స్టాప్ పెట్టాయన్న చర్చ సబబైందిగానే భావించాలి. కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణించి ప్రత్యేకించి చింతపల్లికి చుట్టాలుగా వచ్చే సైబీరియా కొంగలు కిందటి సంవత్సరంతో పాటు ఈ ఏడాది సైతం రాకపోవడంపై సర్వత్రా ఆందోళన కలగడంతో పాటు ఆలోచనలను సైతం రేకెత్తిస్తోంది. కనుమరుగవుతున్న బంతుజాలాన్ని మనం ఆన్లైన్లో చూస్తున్నట్లు ఇకపై సైబీరియా కొంగల్ని కూడా గూగుల్ లో వెతుక్కోవాల్సి వస్తుందేమో.!
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.