Telangana TDP Closed: తెలంగాణలో టీడీపీ అధ్యాయం ముగిసినట్టేనా?-is the telugu desam party chapter over in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tdp Closed: తెలంగాణలో టీడీపీ అధ్యాయం ముగిసినట్టేనా?

Telangana TDP Closed: తెలంగాణలో టీడీపీ అధ్యాయం ముగిసినట్టేనా?

HT Telugu Desk HT Telugu
Oct 31, 2023 10:10 AM IST

Telangana TDP Closed: అనుకున్నంతా అయ్యింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించడంతో పాటు, తన పదవికి, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇక తెలంగాణ లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కానుంది.

తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా?
తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా?

Telangana TDP Closed: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగి నలభై ఏళ్ళు పైబడిన తెలుగుదేశం పార్టీ చివరకు ఇలా కుదేలు కావడంపై చేజేతులా చేసుకున్నదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

yearly horoscope entry point

నందమూరి తారాక రామారావు (ఎన్.టి.ఆర్) 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ ఆవిర్భవించిన కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఏపీపై పూర్తి గుత్తాధిపత్యంతో రాజకీయాలను శాసిస్తున్న తరుణంలో జరిగిన ఈ మార్పు ఓ రికార్డు.

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 203 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, గవర్నర్ రాంలాల్ ఉదంతంతో టీడీపీ ఇతర విపక్ష పార్టీలను కలుపుకొని చిన్న పాటి యుద్దమే చేసింది. ఆ తర్వాత 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో సైతం 202 సీట్లను సొంతం చేసుకుని రెండో సారి అధికారంలోకి వచ్చారు.

అయిదేళ్ల తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని తిరిగి కాంగ్రెస్ కు అప్పజెప్పి 74 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. మరో అయిదేళ్లకు జరిగిన 1994 ఎన్నికల్లో 216 నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి అధికారం చేపట్టింది. కానీ, పార్టీ కుమ్ములలాటల ఫలితంగా 1995లో ఎన్.టి.ఆర్ ను దించేసిన పార్టీ వర్గాలు చంద్రబాబును సీఎం పీఠంలో కూర్చోబెట్టాయి. నాటి సీఎంగా చంద్రబాబు నాయకత్వంలో 1999 ఎన్నికలకు వెళ్లిన టీడీపీ 180 సీట్లలో విజయం సాధించి పవర్ లోకి వచ్చింది. ఇక, ఆ తర్వాతి నుంచి టీడీపీకి కష్టకాలం మొదలైంది.

వైఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన టీడీపీ

కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర ప్రజలను టీడీపీని పక్కన పెట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టేలా చేసింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 47 సీట్లను గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇదే ఆనవాయితీగా 2009 అసెంబ్లీ ఎనినకల్లో సైతం టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయింది. 92 సీట్లను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది.

1999 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో స్థానం దక్కలేదు. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీని పట్టించుకున్న వారు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమ సమయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండు కళ్ల సిద్దంతాం తెలంగానలో టీడీపీ కన్ను లొట్టపోయేలా చేసిందన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ తోటలోకి గోడదూకారు.

2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం మరీ ఘోరంగా 2 నియోజకవర్గాల్లో నెగ్గుకు రాగలిగింది. తెలంగాణలో నవంబరు నెలాఖరున జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చేతులు ఎత్తేసి తన పతనాన్ని రూఢీ చేసింది.

తెలంగాణలో దుకాణం బంద్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీపై పట్టును కోల్పోయిన చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజీకాయలకే పరిమితం అయ్యారు. టీటీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన ఎల్.రమణ బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరి ఎంపీగా విజయం సాధించడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఈ సంధి కాలంలో తెలంగాణలో పార్టీని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న కాసానికి హ్యాండిచ్చారు.తెలంగాణలో పార్టీ పోటీ చేయడం లేదని చావుకబురు చల్లగా చెప్పారు.

దీంతో కాసాని చేసేది ఏమీ లేక పార్టీ అధ్యక్షపదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో చిన్నా చితక పార్టీలన్నీ పోటీకి దిగి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఎన్నికల చరిత్ర ఉన్న టీడీపీని పోటీకి నిలపకవడంతో ఆత్మహత్య వంటిదే అన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.

లోపాయి కారిగా తెలంగాణలో కాంగ్రెస్ కు మేలు చేసేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కాంగ్రెస్ కు సహకరించేందుకే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పార్టీని బొందపెట్టడమేనని టీడీపీ తెలంగాణ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner