Rajendranagar Accident : కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడు- 15 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
Rajendranagar Accident : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, మరో 9 మందికి స్వల్పగాయాలయ్యాయి.
Rajendranagar Accident :హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంతో మంటలు వ్యాపించి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ వంటశాలలో గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. హైదరాబాద్‌కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్‌లో బేకరీ నడుపుతున్నారు. వీరి బేకరీలో సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గురవారం ఉదయం ఆహార పదార్థాలను తయారు చేస్తుండగా, వంటగదిలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి-మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు
కరాచీ బేకరీ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ కు చెందిన కారికులున్నారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు ఇచ్చారు.