CM Revanth Reddy : మరో సంచలన నిర్ణయం దిశగా సీఎం? ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టుకు బ్రేకులు!-hyderabad news in telugu cm revanth reddy not interest to extend orr metro project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : మరో సంచలన నిర్ణయం దిశగా సీఎం? ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టుకు బ్రేకులు!

CM Revanth Reddy : మరో సంచలన నిర్ణయం దిశగా సీఎం? ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టుకు బ్రేకులు!

HT Telugu Desk HT Telugu
Dec 13, 2023 08:51 PM IST

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించునున్నట్లు సమచారం.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ పాలన కనబరుస్తున్నారు. ప్రభుత్వం కొలువు దీరిన రోజు నుంచే సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకపక్క గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ..... మరో పక్క కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రేవంత్ రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

ఓఆర్ఆర్ మెట్రో విస్తరణపై సీఎం సంచలన నిర్ణయం?

హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రో విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయించింది. పటాన్ చెరు నుంచి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్లు....తుక్కుగూడ, పెద్ద అంబర్ పేట్ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ ను నిర్మిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి పటాన్ చెరు వరకు 29 కిలోమీటర్లు మెట్రో ఎక్స్టెన్షన్ చేయాలని భావించారు. ఇటు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ చేపట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాతబస్తీ- విమానాశ్రయం అనుసంధానం?

అయితే తాజాగా ఈ విస్తరణ పనులకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాత బస్తీలో పలు అభివృద్ధి పనుల కార్యచరణపై వారితో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని.. అది కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూర్చుంతుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును రద్దు చేసి పాత బస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని సీఎం యోచిస్తున్నారట.

పెండింగ్ లో ఉన్న జేబీఎస్ - ఫలక్ నుమా కారిడార్ ను పూర్తి చేసి పహాడీ షరీఫ్ ద్వారా విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించాలని సీఎం ఆలోచిస్తున్నారట. రాయదుర్గం - శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు రద్దు చేసి పాత బస్తీ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల పాత బస్తీ కూడా అభివృద్ధి చెందుతుందని ఆలోచన సీఎం చేస్తున్నారట. ఇక ఇదే విషయంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

IPL_Entry_Point