Mission E-Waste : ఈ-వేస్ట్ కు రూ.10 వేలు వరకు డిస్కౌంట్, సెలెక్ట్ మొబైల్స్ వినూత్న కార్యక్రమం-hyderabad minister ktr celekt mobiles started mission e waste collection electronic goods ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mission E-waste : ఈ-వేస్ట్ కు రూ.10 వేలు వరకు డిస్కౌంట్, సెలెక్ట్ మొబైల్స్ వినూత్న కార్యక్రమం

Mission E-Waste : ఈ-వేస్ట్ కు రూ.10 వేలు వరకు డిస్కౌంట్, సెలెక్ట్ మొబైల్స్ వినూత్న కార్యక్రమం

Bandaru Satyaprasad HT Telugu
Aug 11, 2023 07:30 PM IST

Mission E-Waste : ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కు సెలెక్ట్ మొబైల్స్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సెలెక్ట్ మొబైల్స్ అవుట్ లెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ-వేస్ట్ బిన్స్ ఏర్పాటుచేసింది.

మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mission E-Waste : ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌(E-Waste) నిర్వహణ, రీసైక్లింగ్‌లో దేశంలోనే తొలిసారిగా మిషన్‌ ఈ-వేస్ట్‌ పేరుతో వినూత్న కార్యక్రమానికి మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు చేతుల మీదుగా మిషన్‌ ఈ-వేస్ట్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఆరోగ్యం, పర్యావరణంపై ఈ-వేస్ట్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు సెలెక్ట్‌ మొబైల్స్‌ ఒక అడుగు ముందుకేసిందని నిర్వాహకులు తెలిపారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్‌ వినియోగంతో పర్యావరణం, ఆరోగ్యంపై ఈ-వేస్ట్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సరైన రీతిలో నిర్వహించని ఈ-వేస్ట్‌ గాలి, నీరు, మట్టిని కలుషితం చేస్తున్నాయి. ఇది చర్మ వ్యాధుల నుంచి డీఎన్‌ఏ ఉత్పరివర్తనాల వరకు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇందుకు పరిష్కారంగా మిషన్‌ ఈ-వేస్ట్‌కు సెలెక్ట్‌ మొబైల్స్‌ శ్రీకారం చుట్టింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సేకరించిన ఈ-వేస్ట్‌ను నిబంధనలకు అనుగుణంగా రీసైక్లింగ్‌ చేస్తు్న్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ-వేస్ట్‌ నిర్వహణ కేవలం పర్యావరణ హితం కోసమే కాదు, ప్రతి భారతీయ పౌరునికి అత్యవసరం అని సెలెక్ట్‌ మొబైల్స్‌ తెలిపింది.

ఏటా పెరుగుతున్న ఈ-వేస్ట్

భారత్‌లో ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఏటా 20-25 శాతం పెరుగుదల ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020లో 10.45 లక్షల మెట్రిక్ టన్నులు ఈ-వేస్ట్‌ నమోదైంది. ఈ ఏడాది 18.3 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2025 నాటికి 25.4 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా. సమస్య తీవ్రత ముఖ్యంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎక్కువగా ఉంది. ఆశ్చర్యకర విషయం ఏమంటే దాదాపు 95 శాతం ఈ-వేస్ట్‌ మురికివాడలలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా భయంకరమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పనికిరాని మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు, మౌస్, కీబోర్డ్‌ల వంటి పెరిఫెరల్స్‌తో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తారు. ఈ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పారవేయడం పర్యావరణ విపత్తు, మానవ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. వీటితో నేల, నీరు, గాలి కలుషితం అవుతోంది. పీల్చే కాలుష్యాల వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ-వేస్ట్‌లో కనిపించే భారీ లోహాలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ-వేస్ట్‌లోని టాక్సిన్స్ గుండె సమస్యలకు కారణం అవుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలు, అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. హార్మోన్లపై ప్రభావంతో పునరుత్పత్తి, అభివృద్ధి ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది.

ఈ-వేస్ట్ కు కూపన్లు

పనికిరాని ఎలక్ట్రానిక్‌ వస్తువులను సెలెక్ట్‌ రిటైల్‌ స్టోర్లకు తీసుకు వస్తే... కస్టమర్లు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్‌ కూపన్‌ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కూపన్‌ కాల పరిమితి ఆరు నెలల వరకు ఉంటుంది. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్‌ పీసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను డిపాజిట్‌ చేయడం ద్వారా వినియోగదారులు డిస్కౌంట్‌ కూపన్‌ పొందవచ్చు. ప్రతి సెలెక్ట్‌ ఔట్‌లెట్‌లో ప్రత్యేకంగా ఈ-వేస్ట్‌ బిన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే నివాస స్థలాలు, పాఠశాలలు, దేవాలయాలు, ఇతర కీలక ప్రాంతాల్లోనూ ఈ-వేస్ట్‌ కియోస్క్‌లను అందుబాటులో ఉంచాలన్నది ఈ కంపెనీ ప్రణాళిక. సెలెక్ట్‌ మొబైల్స్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 150 అవుట్ లెట్స్ ఉన్నాయి.

మనవాళికి అతి పెద్ద సవాల్ - మంత్రి కేటీఆర్

ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్‌ పరికరాలను సరైన రీతిలో నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అట్టిపెట్టుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ-వేస్ట్ పారవేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య ప్రమాదాలను ఆయన గుర్తు చేశారు. మిషన్ ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సెలెక్ట్‌ మొబైల్స్‌ చొరవను ప్రశంసించారు. కంపెనీ అంకితభావాన్ని, పెరుగుతున్న ఈ-వేస్ట్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో వారి ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ కారిడార్లు, మాల్స్, బస్టాప్‌లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే కీలక ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్‌ డబ్బాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని గుర్తు చేశారు. మానవాళికి అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను నిర్వహిస్తేనే మనుగడ ఉంటుందని అన్నారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ పోగవుతోందని మంత్రి వెల్లడించారు.

Whats_app_banner