Hyderabad Crime : బీర్ బాటిల్స్ కోసం గొడవ, నడిరోడ్డుపై యువకుడు దారుణ హత్య!
Hyderabad Crime : బీర్ బాటిల్స్ ఇవ్వలేదని ఓ యువకుడ్ని కత్తితో పొడిచి చంపిన ఘటన మీర్ పేట్ లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad Crime : చిన్న చిన్న కారణాలకు గొడవ పెట్టుకుని హత్యలు చేస్తు్న్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. హైదరబాద్ మీర్ పేట్ లో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. బీర్ బాటిళ్ల కోసం ఓ యువకుడిని హత్య చేశారు నలుగురు యువకులు. కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. మీర్ పేట్ లో ఇటీవల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
అసలేం జరిగింది?
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో దారుణం జరిగింది. బీర్ బాటిళ్లు ఇవ్వడానికి నిరాకరించాడని ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి జిల్లెల్లగూడలో సాయి వరప్రసాద్ అనే వ్యక్తి బీర్ బాటిళ్లు కొనుగోలు చేసి వెళ్తున్నాడు. అతడిని కొంత మంది యువకులు అడ్డుకున్నారు. ఆ బీర్ బాటిల్స్ తమకు ఇవ్వాలని బెదిరించారు. ఎందుకు ఇవ్వాలని సాయి యువకులను ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ అనే నలుగురు యువకులు సాయిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అప్పటికీ సాయి బీర్ బాటిల్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఆ నలుగురు సాయి మరింత తీవ్రంగా కొట్టడం... భయంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. సాయిని రక్షించేందుకు స్థానికులు వస్తారని భావించిన ఆ నలుగురు అతడిని కత్తితో పొడిచారు. ఈ దాడిలో సాయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
గంజాయి మత్తులో?
సాయి రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే...ఆ నలుగురు బీర్ బాటిల్స్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న మీర్ పేట్ పోలీసులు... సాయిని పరిశీలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ పై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు గంజాయి మత్తులో ఈ దాడి చేశారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. బీర్ బాటిళ్ల కోసం నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.