హైదరాబాద్‌లో జోరందుకున్న గణేష్ నిమజ్జనం సందడి-hyderabad gearing up for massive ganesh immersion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో జోరందుకున్న గణేష్ నిమజ్జనం సందడి

హైదరాబాద్‌లో జోరందుకున్న గణేష్ నిమజ్జనం సందడి

HT Telugu Desk HT Telugu
Sep 24, 2023 08:20 AM IST

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందడి జోరందుకుంది. శని, ఆదివారాలు వారాంతం కావడం, నవరాత్రుల్లో ఐదు రాత్రులు గడవడంతో కాలనీల్లో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి.

అల్వాల్ చెరువులో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న నారాయణాద్రి అపార్ట్‌మెంట్ నివాసులు
అల్వాల్ చెరువులో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న నారాయణాద్రి అపార్ట్‌మెంట్ నివాసులు

ఈనెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం పదో రోజు లేదా పదకొండో రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష విగ్రహాల సంఖ్య ఎక్కువ కావడంతో మూడో రోజు నుంచే నిమజ్జనాలు సందడి మొదలవుతంది. ఇక శనివారం వారాంతం కావడం, ఐదు రోజులు పూర్తికావడంతో అనేక కాలనీల్లో నిమజ్జన వేడుకలు జోరందుకున్నాయి.

yearly horoscope entry point

వినాయకుడి భక్తులు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే పలు మండపాల వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. భక్తి, జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ చిన్నాపెద్దా సందడి చేశారు. సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.

నిమజ్జనానికి కొలనులు సిద్ధం

జంట నగరాల్లో గణేష నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ చక్కటి ఏర్పాట్లు చేసింది. 22 ప్రాంతాల్లో భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది.

వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు జీహెచ్ఎంసీ కొలనులు, క్రేన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేలా చేసింది.
వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు జీహెచ్ఎంసీ కొలనులు, క్రేన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేలా చేసింది.

కాగా శనివారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు నిర్వాహక కమిటీ తెలిపింది. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న ప్రముఖుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, సినీ దర్శకుడు రాజమౌళి తదితరులు ఉన్నారు.

రాచకొండ పరిధిలో బందోబస్తు ఏర్పాట్లు

రాచకొండ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. క్యూఆర్ కోడ్‌తో నిమజ్జన ర్యాలీలను పర్యవేక్షించనున్నారు. విగ్రహాల వారీగా నిమజ్జన తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాలను ఈ క్యూఆర్ కోడ్ లో పొందుపరిచారు. ఇక నిమజ్జనం చేసే ప్రదేశాలు, మార్గాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. అలాగే మహిళా భక్తులకు రక్షణగా షీ టీమ్స్ బృందాలు పనిచేస్తాయని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది.

గణేష నిమజ్జన ర్యాలీలో పిల్లలూ పెద్దల సందడి
గణేష నిమజ్జన ర్యాలీలో పిల్లలూ పెద్దల సందడి
Whats_app_banner