Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం- వ్యక్తి ఇంట్లో నిద్రపోతుండగానే కూల్చివేత
Hyderabad Crime : ఇంట్లో వ్యక్తి నిద్రపోతుండగా ఇల్లు కూల్చివేశారు. ఈ ప్రమాదంలో శిథికాల కింద పడి ఆ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Hyderabad Crime : వ్యక్తి నిద్రపోతుండగా ఇల్లు కూల్చివేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad Accident )లో చోటుచేసుకుంది. కూకట్ పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్...తన పాత ఇంటికి బుధవారం కూల్చివేశారు. అయితే కూల్చివేతకు ముందు ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. బుధవారం ఉదయం ఇంటిని పాక్షికంగా కూల్చివేయగా.. మధ్యాహ్నం పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే అద్దెకు ఉన్న స్వామి రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో ఖాళీ చేసిన ఇంట్లో పడుకున్నాడు. స్వామి రెడ్డి ఇంట్లో ఉన్న విషయం తెలియక కూల్చివేశారు. శిథిలాల కింద పడి స్వామి రెడ్డి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని స్వామి రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అద్దెకు ఉన్న వారికి ముందే సమాచారం ఇచ్చి ఇల్లు ఖాళీ చేయించామని యజమాని అంటున్నారు. మద్యం మత్తులో స్వామి రెడ్డి పాత ఇంటికి వచ్చి పడుకున్నాడా? లేదా ఇంట్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తు్న్నారు.
ముందుగా సమాచారం ఇచ్చాం-ఇంటి యజమాని
ఇంటి యజమాని, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ...తాను ముందుగానే అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇచ్చి ఇంటిని ఖాళీ చేయాలని చెప్పానన్నారు. కూల్చివేత సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అని ముందుగా పరిశీలించామని అన్నారు. అయితే స్వామి రెడ్డి ఎప్పుడు వచ్చి ఇంట్లో పడుకున్నాడో తెలియదన్నారు. ముందుగా సమాచారం ఇచ్చామని, స్వామి రెడ్డి మృతితో తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఏ కోణంలో ముందుకు వెళ్తారో తెలియాల్సి ఉంది.
వచ్చే నెలలో పెళ్లి ఇంతలోనే
హైదరాబాద్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మరో నెలలో వివాహం నిశ్చయించుకున్న యువకుడు ప్రాణాలు విడిచాడు. పెళ్లికి ముందు స్మైల్ డిజైనింగ్(Smile Designing) చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వింజం లక్ష్మీనారాయణ(28) అనే యువకుడు డెంటల్ చికిత్స కోసం జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్ నెం. 37లో ఉన్న ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్(Dental clinic) కు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడు దూరమయ్యాడని రోధిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం