HMDA Land Auction : ఇక ‘బుద్వేల్‌’ భూముల వేలం - ఎకరాకు కనీస ధర రూ.20కోట్లు, నోటిఫికేషన్ జారీ-hmda notification for budvel land auction check important details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmda Land Auction : ఇక ‘బుద్వేల్‌’ భూముల వేలం - ఎకరాకు కనీస ధర రూ.20కోట్లు, నోటిఫికేషన్ జారీ

HMDA Land Auction : ఇక ‘బుద్వేల్‌’ భూముల వేలం - ఎకరాకు కనీస ధర రూ.20కోట్లు, నోటిఫికేషన్ జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 04, 2023 01:38 PM IST

Budvel Land Auction: కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల వేలం ఆల్ టైం రికార్డును సృష్టించిన సంగతి తెలిసిదే. ఇదిలా ఉండగానే…అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను HMDA పేర్కొంది.

 బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్
బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్

HMDA Land Auction : కోకాపేట భూముల వేలం కేక పుట్టించాయి. ఏకంగా ఎకరం భూమి వంద కోట్లు పలికింది. దీంతో హైదరాబాద్ లోని భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన వేలం ద్వారా 3వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాబట్టింది. ఇదిలా ఉంటే... ఈసారి బుద్వేల్ భూములను వేలం వేసేందుకు రెడీ అయింది హెచ్ఎండీ. ఇక్కడి భూముల అమ్మకానికి జారీ చేసింది. ఇక్కడ కూడా ఎకరాకు రూ. 20 కోట్ల కనీస ధరను నిర్ణయించింది.

మొత్తం 100 ఎకరాలు...14 ప్లాట్లు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనుంది తెలంగాణ ప్రభుత్వం. బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ. 20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఆగస్టు 6వ తేదీన ప్రీబిడ్ సమావేశం ఉంటుంది. ఆగస్టు ఎనిమిదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఆగస్టు 10వ తేదీన ఈ - వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ. 30కోట్ల ధరకు అమ్ముడుపోయినా కనీసం రూ. 3వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.

కోట్లు కురిపించిన కోకాపేట…

ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ-వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన వేలంలో తెలంగాణ భూములకు కనీవినీ ఎరుగని ధర పలికింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట లోని నియో పోలీస్ ఫేస్ టు లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను సొంతం చేసుకున్నారు.

మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.3,319 వేల కోట్లను ఆర్జించింది సర్కార్. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరనే రూ. 35 కోట్లుగా ఉంది. కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌లోని భూముల వివరాలు చూస్తే… ప్లాట్‌ నెంబర్‌ ఆరులో 7 ఎకరాల భూమి ఉంది. ప్లాట్‌ నెంబర్‌ 7లోని చూస్తే 6.55 ఎకరాలు, 8లో 0.21 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 14లో 7.34 ఎకరాల భూమి ఉంది. ఇలా మొత్తం 45.33 ఎకరాల భూమిని వేలం వేసింది హెచ్ఎండీఏ.

ఏడాది క్రితం కోకాపేటలో తొలివిడతగా 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ల విక్రయం చేపట్టింది తెలంగాణ సర్కార్. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండో విడత విక్రయాల ద్వారా కూడా అంతే మొత్తంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. నిజానికి, నియో పొలిస్‌తోపాటు గోల్డెన్‌ మైల్‌ పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములు కొనుగోలుకు గత ఏడాది చాలా సంస్థలు పోటీ పడ్డాయి. అత్యధికంగా రూ.60 కోట్లు దాకా చెల్లించి ఎకరం భూమిని కొనుగోలు చేశాయి. అయితే ఈసారి భారీ స్థాయిలో ధరలు రావని అభిప్రాయలు ఉన్నాయి. జీవో 111 ప్రభావంతో... రెండో విడత ఈ-వేలానికి పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ వాటిని తలకిందులు చేస్తూ… ఏకంగా 3 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఎకరం భూమి వంద కోట్లు పలకటం ఆల్ టైం రికార్డుగా నమోదైంది.

Whats_app_banner

సంబంధిత కథనం