Hyderabad Rains : బీ అలర్ట్...! హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం
Heavy Rains in Hyderabad : హైదరాబాద్ లో మళ్లీ వర్షం షురూ అయింది. గురువారం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
హైదరాబాద్ మళ్లీ వర్షం మొదలైంది. పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అబిడ్స్ , కోటి , మలక్ పేట , చాధర్ ఘాట్, సికింద్రాబాద్, చిలకలగూడ, ఎల్బీ నగర్, వనస్థలిపురం,హయత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరోవైపు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
మరో నాలుగు రోజులు వర్షాలు…!
మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సరిహద్దు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎగువన విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఇది వచ్చే రెండు రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపింది.
ఇవాళ తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
రేపు ఆదిలాబాద్ , మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది, సెప్టెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.