Dogs Killed Goats: కుక్కల దాడిలో మేకల మృతి, మేక కళేబరాలతో మునిసిపల్ కార్యాలయంలో ఆందోళన
Dogs Killed Goats: కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతూ కుక్కల దాడితో మృతి చెందిన మేక కళేబరాలతో మునిసిపల్ ఆఫీసులో యువకుడు ఆందోళనకు దిగిన ఘటన కరీంనగర్‌లో జరిగింది.
Dogs Killed Goats: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని అజీజుద్దీన్ ఫైజాన్ అనే యువకుడు వినూత్న అందోళనకు దిగాడు. కుక్కల దాడిలో చనిపోయిన మేకల కళేబరాలతో మునిసిపల్ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేశాడు.
మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంతో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించాడు. ఇంటి ఆవరణలో ఉన్న మేకల దొడ్డిపై వీధి కుక్కలు దాడి చేసి మేకల ప్రాణాలు తీశాయని ఆందోళన వ్యక్తం చేశాడు. పలుమార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.
కుక్కల దాడితో ఇప్పటివరకు 2 లక్షల రూపాయల విలువైన మేకలు కోళ్ళను కోల్పోయానని ఆందోళన వ్యక్తం చేశాడు.ఊ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేకల కళేబరాలను మునిసిపల్ కమిషనర్ కార్యాలయం ముందు వేసి అక్కడే బైఠాయించాడు. కుక్కల బెడద నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.
కమీషనర్ సీరియస్…
మేకల కళేేబరాలను మున్సిపల్ కార్యాలయంలో వేసి యువకుడు ఆందోళన చేయడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు. మేకల కళేబరాలను సిబ్బందితో తొలగించి యువకుడిని వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు కమిషనర్ ను కుక్కల సైరవిహారం పై నిలదీశాడు.
గత కొద్ది రోజులుగా కుక్కల బెడదపై ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. పదుల సంఖ్యలో కుక్కలు పశువుల దొడ్డి పై దాడి చేస్తే అడ్డుకోపోయినా తనపై కుక్కలు దాడికి యత్నించాయని, కుక్కల దాడిలో తాను చనిపోతే ఇలానే ప్రవర్తిస్తారా అని నిలదీశాడు. పశువుల ప్రాణాలు పోయినా మనుషులపై దాడి చేసిన పట్టించుకోరా అని ఆందోళన వ్యక్తం చేశాడు యువకుడు.
గతంలో కోడితో నిరసన..
ఇదే యువకుడు కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని మూడు మాసాల క్రితం కుక్కల దాడిలో చనిపోయిన కోడిని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం డోర్ కు కట్టేసి నిరసన తెలిపాడు. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. తాజాగా మేకలు కుక్కల దాడిలో చనిపోవడంతో మేకల కళేబరాలతో యువకుడు నిరసన తెలపడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందంటున్నారు కొత్తపల్లి గ్రామస్తులు.
ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుక్కల నివారణకు మున్సిపల్ పరంగా గత 4 ఏళ్ళుగా తీసుకుంటున్న చర్యలు ఏంటని సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం కోరితే నాలుగేళ్లుగా కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మున్సిపల్ అధికారులు సమాధానం ఇచ్చారని అజీజుద్దీన్ ఫైజాన్ తెలిపారు.
ఊర కుక్క కోసం మందు పెడితే పెంపుడు కుక్క మృతి..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామ్ హనుమాన్ నగర్ లో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయని గొర్రెలకాపరి మందు పెట్టాడు. దీంతో మానేటి ఎల్లారెడ్డి కి చెందిన పెంపుడు కుక్క మృతి చెందింది. పెంపుడు కుక్క మృతి తో ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఎల్లారెడ్డి కుమారుడు తిరుపతి రెడ్డి పిర్యాదుతో ఎల్ఎండీ పోలీసులు గొర్రెల కాపరి దాడి కొమురయ్యపై కేసు నమోదు చేశారు. జంతు సంరక్షణ, జీవ హింస క్రింద చర్యలు చేపట్టినట్లు ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు తెలిపారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్)