Fake Judge : వీడు మాములోడు కాదు.. ఏకంగా హైకోర్టు జడ్జినంటూ నమ్మిస్తూ మోసాలు-fake judge arrested by rachakonda police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Judge : వీడు మాములోడు కాదు.. ఏకంగా హైకోర్టు జడ్జినంటూ నమ్మిస్తూ మోసాలు

Fake Judge : వీడు మాములోడు కాదు.. ఏకంగా హైకోర్టు జడ్జినంటూ నమ్మిస్తూ మోసాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 29, 2023 01:29 PM IST

Rachakonda Police: న్యాయమూర్తినంటూ చెప్పుకుంటూ దందాలు చేస్తున్న ఓ వ్యక్తి ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీతో పాటు కొంతమేర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

నిందితుడు  నామాల నరేందర్
నిందితుడు నామాల నరేందర్

Fake Judge Arrest: వేములవాడలో డిగ్రీ పూర్తి చేశాడు.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడ్డాడు...! అందుకోసం ఈజీ మనీ కోసం సరికొత్త ఎత్తుగడ వేశాడు. ఏకంగా జడ్జి అవతారం ఎత్తాడు. పైగా తనకంటూ ఓ గన్‌మెన్‌ను నియమించుకున్నాడు ఆ కేటుగాడు. ఫేక్ వెబ్ ‌సైట్ తయారు చేయించి అమాయక ప్రజలను దోచేస్తున్నాడు. భూ సమస్యలు పరిష్కారం చేస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇతగాడి వ్యవహారం కాస్త పోలీసుల వరకు చేరింది. పక్కాగా మాటు వేసిన రాచకొండ పోలీసులు.... కేటుగాడి ఆటకట్ట కట్టించారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం....

వేములవాడకు చెందిన నామాల నరేందర్(31) అనే వ్యక్తి ఈజీ మని కోసం అలవాటు పడ్డాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను కొద్దిరోజుల తర్వాత హైదరాబాద్ కు వచ్చాడు. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఆశతో తొలుత దొంగతనాలు చేశాడు. 2014- 2016 సంవత్సరాల్లో అనేక కేసుల్లో ఉన్నాడు. హైదరాబాద్, కరీంనగర్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017లో నరేందర్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కట్ చేస్తే... ఆ తర్వాత కంప్లీట్ గా రూట్ మార్చాడు. ఖమ్మం నగరానికి షిఫ్ట్ అయిన ఇతను... ఏకంగా జడ్జినంటూ నమ్మించే ప్రయత్నాలు షురూ చేశాడు. భూవివాదాలను పరిష్కరిస్తానంటూ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇదే విషయంపై ఫిర్యాదు రాగా... ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. జైలుకు కూడా తరలించారు.

జైలు నుంచి విడుదలైన నరేందర్... మళ్లీ హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. ఏకంగా హైకోర్టు అడిషనల్ సివిల్ జడ్జిగా వేషం మార్చాడు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి భూ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు తీసుకున్నాడు. చాలా రోజులు గడిచిపోయింది కానీ సోమిరెడ్డి భూ సమస్య తీరలేదు. మోసపోయానని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో అసలు విషయం అర్థమైంది.. నరేందర్ నకిలీ జడ్జిగా చలామణి అవుతూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. ఇక జనాలను నమ్మించేందుకు జమ్మూకశ్మీర్ ఆర్మీలో పని చేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని కూడా గన్ మె‌న్‌గా నియమించుకున్నాడు. ఇద్దరూ కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

నిందితుడి నాగేందర్ నుంచి నుంచి ఒక తుపాకీ, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, క్యాష్, నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేయటంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనర్ చౌహాన్ అభినందించారు.

Whats_app_banner