Jagityal Govt Doctors: కడుపులో దూది, క్లాత్ వదిలేసి కుట్లు వేసిన జగిత్యాల వైద్యులు
Jagityal Govt Doctors: జగిత్యాల ప్రబుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. సిజేరియన్ కోసం వెళ్లిన మహిళకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కడుపులోనే దూది, బ్యాండేజిలను వదిలేశారు. ఏడాదికిపైగా తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ చివరకు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో అసలు నిజం బయటపడింది.
Jagityal Govt Doctors:జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. వైద్యుల నిర్వాకం తో ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత తన పుట్టినిల్లైన జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో గతేడాది డిసెంబర్ లో ఆసుపత్రిలో చేరింది.
పిల్లలు పుట్టకుండా ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు వేశారు. దీంతో అప్పటినుంచి అంటే గత 16 నెలలుగా నవ్య శ్రీ కడుపునొప్పితో బాధపడుతోంది.
వైద్యం కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. దాదాపు ఏడాదిన్నరగా సమస్య తగ్గకపోగా బాధ ఇంకాఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో వేములవాడ పెద్ద ఆసుపత్రిలో చేరింది. బాధితురాలికి అక్కడ స్కానింగ్ చేసి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్కానింగ్ లో నవ్య శ్రీ పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో నవ్య శ్రీ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.
జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్లను అడుగుదామని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు అక్కడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. అనంతరం ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల మాత శిశు, ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆరుగురు గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మృతి చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు, మరణించిన వారి కుటుంబ సభ్యులు ఎన్ని ధర్నాలు చేసిన అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి వారిపైఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి
తాజాగా బాలింత కడుపులో బ్యాండేజి క్లాత్ ఉంచి కుట్లు వేసిన ఉదంతం కలకలం రేపుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జగిత్యాల ఏరియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాములుకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ యాస్మిన్ భాషా ప్రకటించారు. ఘటనకు బాద్యులైన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించమన్నారు.