Congress leaders Meet Mynampally: మైనంపల్లికి లైన్ క్లియర్ అయినట్టే, రెండు టిక్కెట్లకు ఓకే
Congress leaders Meet Mynampally: కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటున్న మైనంపల్లి హనుమంతరావుకు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. వెలమ సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునే క్రమంలో మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్‌కు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Congress leaders Meet Mynampally: మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీలో లైన్ క్లియర్ అయినట్టే ఉంది. మైనంపల్లి హన్మంతరావుతో వారి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క ,మధూయాష్కీ, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు మైనంపల్లి ప్రకటించారు.
కాంగ్రెస్ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27 లోపు పార్టీలో చేరతానని చెప్పారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు వివరించారు. అలాగే తన తరఫున నక్క ప్రభాకర్‌కు కూడా మేడ్చల్ టికెట్ అడిగినట్లు మైనంపల్లి వివరించారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారాని,తన కార్యకర్తలు, అభిమానాలు యొక్క సూచనను కూడా పరిగణలోకి తీసుకొనే కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరడానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. ఈనెల 27 లోపు మంచి ముహూర్తాలు ఉన్నాయని ఆలోపే పార్టీలో చేరుతారని అయన ప్రకటించారు.
తమకు మద్దతు తెలుపుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారాని మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.తన కుమారుడు బయటికి రావడంతో ఇంకా చాలా మంది పార్టీ నుండి బయటికి వచ్చే ఆలోచనలో పడ్డారన్నారు. కెసీఆర్ పర్యటనలో నేతలను హౌస్ అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.
ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్, కనీసం ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ఉండాలనే నిబంధనల నుంచి మైనంపల్లికి మినహాయింపు లభించినట్టేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గెలుపు అవకాశాలను బట్టి తండ్రి, కొడుకులకు టిక్కెట్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చిటన్లు తెలుస్తోంది.