CM KCR in Nanded : దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? నాందేడ్ లో కేసీఆర్ వ్యాఖ్యలు-cm kcr speech at party cadre training program in nanded maharashtra ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Cm Kcr Speech At Party Cadre Training Program In Nanded Maharashtra

CM KCR in Nanded : దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? నాందేడ్ లో కేసీఆర్ వ్యాఖ్యలు

నాందేడ్ సభలో కేసీఆర్
నాందేడ్ సభలో కేసీఆర్

CM KCR Latest News:దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు.

CM KCR Nanded Tour: మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్‌ పార్టీ శిక్షణ శిబిరాన్ని ముఖ్యంత్రి కేసీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన… దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెడితేనే దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? అంటూ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్… కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిందన్న కేసీఆర్... విద్వేష రాజకీయాలు చేసిన బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని... ప్రజలు గెలవాలన్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ అమలు కావాలని చెప్పుకొచ్చారు.

దేశవ్యాప్తంగా మార్పు తేవాలనే లక్ష్యంతోనే బీఆర్​ఎస్ ఆవిర్భవించిందన్నారు గులాబీ బాస్ కేసీఆర్. చిన్న దేశాలైన సింగపూర్‌, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నామని.... ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎల్లకాలం పోరాటాలు చేస్తూ బలికావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక సమస్యలను పరిస్కరించుకున్నామని చెప్పారు కేసీఆర్. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందన్నారు. శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ ఆహ్వానించారు.

సంబంధిత కథనం