CM KCR On Podu Lands: హామీ ఇస్తేనే పోడు భూములిస్తాం - అసెంబ్లీలో సీఎం కేసీఆర్
telangana assembly budget session 2023: పోడు భూముల అంశంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం అసెంబ్లీ మాట్లాడిన ఆయన.. ఈనెల చివర్లో పోడు భూముల పట్టాలను అందజేస్తామని చెప్పారు.
CM KCR in Telangana Assembly: ఈ నెలఖారులో పోడు భూముల పంపిణీ చేపడుతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం... పోడు భూముల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. దాదాపు పదకొండున్నర లక్షలకు పైగా భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని... వీటిని అందజేసే ఏర్పాట్లు కూడా సిద్ధమవున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. అడవులు నరకబోమని రాతపూర్వక హామీ ఇచ్చే వారికి మాత్రమే పోడు భూములు ఇస్తామని... ఇవ్వనివారికి ఎట్టిపరిస్థితుల్లో కేటాయించమని తేల్చి చెప్పారు.
“నిజానికి చట్ట ప్రకారం పోడు భూములపై హక్కులు ఉండవు. గత ప్రభుత్వాల తీరుతోనే ఈ సమస్య జఠిలంగా మారింది. కొందరు ఇదే అంశంపై ధర్నాలు చేయటం వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలపై బాధ్యత ఉంటుంది. గిరిజన బిడ్డల హక్కులు కాపాడుకోవాల్సిందే. అటవీ సంపద ఉండాలంటే కాపాడుకోవాలంటే అడవులను నరకవద్దు. చాలా నిబంధనలు పెట్టి అడవులను పెంచుతున్నాం. ఈ విషయంలో పంచాయితీ కార్యదర్శులకు కూడా కఠిన నిబంధనలు పెట్టాం. ప్రభుత్వ చర్యలతో గ్రీన్ కవరేజ్ పెరిగింది. పోడు భూమలు విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న వారికి ఇవ్వటానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఉపాధి లేనివారి గిరిజనుబంధు పథకం ఇస్తాం. రైతుబంధు పథకం కూడా వర్తింపజేస్తాం. విద్యుత్ సరఫరా అందజేస్తాం. పోడు భూముల పంపిణీ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి లోతుగా చర్చిస్తాం. పోడు భూములు పొందేవారు అటవీ సంపదను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో వారి నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకుంటాం. అడవులు నరికితే పట్టాలు రద్దు చేస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు” అని చెప్పారు.
"పోడు భూముల విషయంలో ఎమ్మెల్యేలకు కూడా లేఖలు రాస్తాం. ఆ వివరాలను కూడా అసెంబ్లీకి సమర్పిస్తాం. పోడు భూమిలో గజం కూడా కబ్జాకు గురికాకుండా చూడాలనేదే ప్రభుత్వ ఉద్జేశ్యం. లబ్ధిదారులతో పాటు అఖిలపక్ష పార్టీలు, గ్రామాల్లోని గిరిజన పెద్దల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటాం. ఈ విషయంలో ముందుకురాని గ్రామ పంచాయతీల పరిధిలోని వారికి పట్టాలు ఇవ్వం. రాబోయే రోజుల్లో అడవుల పరిరక్షణకు సాయుధ గస్తీ దళాలను కూడా ఏర్పాటు చేస్తాం. ఈనెలాఖాలోనే పోడు భూముల పంపిణీ చేపడుతాం" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.