Cheruku Sudhakar : సొంతగూటికి ఉద్యమకారులు..! కారెక్కనున్న చెరుకు సుధాకర్
Telangana Election 2023: తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికి సుపరిచితమైన డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ ను వీడనున్నారు. తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రేపోమాపో ఆయన… సొంత గూటికి చేరటం ఖాయంగానే కనిపిస్తోంది.
Telangana Election 2023: తెలంగాణ ఉద్యమ కారులు ఒక్కొక్కరే తిరిగి తమ ఉద్యమాలకు వేదికనిచ్చిన భారత రాష్ట్ర సమితి ( అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ) గూటికి చేరుకుంటున్నారు. గడిచిన పది పదిహేనేళ్లుగా గులాబీ పార్టీకి దూరంగా ఉన్న ఈ నాయకులు ఆయా పార్టీలో తమ లక్ ను పరీక్షించుకుని విఫలమై సొంత గూడుకు చేరుతున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) సమక్షంలో తన అనుయాయులతో కలిసి గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇపుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గానికే చెందిన మరో సీనియర్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ వంతు వచ్చింది. ఆయన కూడా రేపోమాపో గులాబీ కండువా కప్పుకోవడమే మిగిలింది.
తెలంగాణ ఇంటి పార్టీ టు కాంగ్రెస్ టు బీఆర్ఎస్
డాక్టర్ చెరుకు సుధాకర్ 2014 ఎన్నికల సమయానికి ముందే ఒక విధంగా బీఆర్ఎస్ కు దూరమయ్యారు. ఆ సమయంలో ఆయన అప్పటి టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో తనను కాదని, అప్పుడప్పుడే పార్టీలో చేరిన వేముల వీరేశానికి నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పజెప్పండతో డాక్టర్ చెరుకు సుధాకర్ అలక బూనారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా టికెట్ దక్కలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ కారుల వేదిక ఏర్పాటు చేసి పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలంగాణ ఇంటి పార్టీకి పురుడు పోశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. చివకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
కాంగ్రెస్ ను ఎందుకు వీడుతున్నారు..?
కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆయనకు పొసగలేదు. ఇద్దరి మధ్య వివాదం కూడా జరిగింది. అయితే, టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి డాక్టర్ చెరుకు సుధాకర్ ను వెనకేసుకొచ్చినా.. ఈ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సైతం కోమటిరెడ్డితో సయోధ్య చేసుకున్నారని చెబుతున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం చెరుకు సుధాకర్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వక పోవడం, కనీస గుర్తింపు కూడా లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాల్సి ఉంది. కానీ, జిల్లాలో ఇప్పటికి ఒక్క ఆలేరు మాత్రమే కేటాయించారు. మరో స్థానాన్ని కేటాయిస్తారన్న నమ్మకం కూడా లేకపోవడం, తనకు ఎక్కడా అవకాశం కూడా దక్కే సూచనలు లేకపోవడం, పార్టీలో చెప్పుకోదగిన బాధ్యతలు లేకపోవడం వంటి అంశాలపై తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ ను వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మంత్రి హరీష్ రావు మధ్యవర్తిత్వం
పార్టీలో ఉన్నప్పటి నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ కు మంత్రి హరీష్ రావుతో మంచి సంబంధాలే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులనంతా తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతల్లో భాగంగా మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ లో కుదురుకోలేక పోతున్న డాక్టర్ చెరుకు సుధాకర్ ను సంప్రదించి ఒప్పించినట్లు తెలుస్తోంది. ‘‘ కనీసం నా సీనియారిటీని, అనుభవాన్ని పార్టీ కోసం ఉపయోగించుకునే తెలివి కాంగ్రెస్ నాయకత్వానికి లేదు. ఇక్కడ బయట పార్టీలో ఉండి ఏం కొట్లాడగలం. అందుకు సొంత పార్టీలో ఉంటే మేలన్న అభిప్రాయానికి వచ్చిన. అక్కడ కనీస గౌరవమైనా దక్కుతుంది. పార్టీ నాయకత్వం నుంచి నాకు ఆహ్వానం ఉంది. అనుచరులతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాను...’’ అని డాక్టర్ చెరుకు సుధాకర్, ‘హిందుస్థాన్ టైమ్ – తెలుగు' తో వ్యాఖ్యానించారు. ఆయన రేపోమాపో గులాబీ కండువా కప్పు కోవడం ఖాయమైంది.