Challa Dharmareddy: నర్సంపేట ద్రోహి రేవూరి అంటున్న చల్లా
Challa Dharmareddy: కాంగ్రెస్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి నమ్మక ద్రోహి అని, నమ్మిన నర్సంపేట, హనుమకొండ ప్రజలను మోసం చేసి ఇప్పుడు పరకాల కు వచ్చారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు.
Challa Dharmareddy: పరకాల నియోజకవర్గం డెవెలప్ కాలేదని అనే వాళ్లంతా సన్నాసులని చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో సోమవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట, వరంగల్ వెస్ట్ రెండు నియోజకవర్గాల ప్రజలు తరిమికొడితే దిక్కులేక పరకాలకు వచ్చాడని విమర్శించారు.
రేవూరికి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని ఎద్దేవా చేశారు. అక్కడ చెల్లని వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదో చేస్తా అంటే పరకాల ప్రజలు నమ్మబోరన్నారు. నియోజకవర్గ భౌగోళిక స్వరూపం కూడా తెలియని వాళ్లు పరకాల అభివృద్ధి చెందలేదనడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందో.. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో డెవలప్ అయ్యిందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేని గుడ్డివారని మండిపడ్డారు.
స్వార్థ రాజకీయ లబ్ధి కోసం పరకాల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)