Vande Bharath Trains : వందే భారత్‌ రైళ్లలో అవి లేకపోవడమే ప్రమాదాలకు కారణమా…?-cattle guard arrangement missed in vande bharath trains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharath Trains : వందే భారత్‌ రైళ్లలో అవి లేకపోవడమే ప్రమాదాలకు కారణమా…?

Vande Bharath Trains : వందే భారత్‌ రైళ్లలో అవి లేకపోవడమే ప్రమాదాలకు కారణమా…?

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 11:28 AM IST

Vande Bharath Trains దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో ఓ ఏర్పాటు లేకపోవడమే ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే క్రమంలో దేశీయ పరిస్థితుల్ని విస్మరించారనే వాదన వినిపిస్తోంది. దేశంలో రైల్వే నెట్‌ వర్క్ విస్తరించి ఉన్న పరిస్థితులు, రక్షణ ఏర్పాట్లను పరిగణలోకి తీసుకోకుండా వేగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదన నిపుణులు నుంచి వినిపిస్తోంది.

పశువుల ప్రమాదాలు జరగకుండా రైలింజన్లకు క్యాటిల్ గార్డ్ ఏర్పాటు
పశువుల ప్రమాదాలు జరగకుండా రైలింజన్లకు క్యాటిల్ గార్డ్ ఏర్పాటు (ELS)

Vande Bharath Trains దేశ వ్యాప్తంగా రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచే క్రమంలో భారతీయ రైల్వేల దేశీయం రూపొందించిన వందే భారత్‌ రైళ్లలో ఓ కీలకమైన ఏర్పాటును మరిచిపోయారు. రైళ్ల తయారీలో సాంకేతికంగాను, భద్రతా పరంగా అన్ని చర్యలు చేపట్టినా దేశీయ రైల్వే నెట్‌ వర్క్ విస్తరించి ఉన్న భౌగోళిక పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకునే ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదనే వాదన ఉంది.

దేశంలో హైస్పీడ్ రైల్ నెట్‌ వర్క్ విస్తరణకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్ల రాకడపై ఉన్న విమర్శల్ని తిప్పి కొట్టేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. రైల్వే ట్రాక్‌ల ఆధునీకీకరణ, సామర్థ్యాన్ని పెంచడం వంటి పనులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల నివారణకు “కవచ్” వంటి ఆధునిక ఆవిష్కరణలు కూడా జరిగాయి. రైల్వే ట్రాక్‌లపై ప్రమాదాల నియంత్రణకు, రైళ్లు ఢీకొట్టడకుండా ఆటోమెటిక్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు.

దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు తరచూ ప్రమాదాలు జరగడం రాజకీయ విమర్శలకు కారణమైంది. వంది కిలోమీటర్లకు పైగా వేగంగా ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దారు. దేశంలోని అన్ని రైల్వే జోన్లలో దశల వారీగా ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ మార్గాల్లో అవి ప్రమాదాలకు గురి కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

రైలింజన్లలో భాగమైన  రైల్ గార్డ్‌ ఏర్పాటు
రైలింజన్లలో భాగమైన రైల్ గార్డ్‌ ఏర్పాటు

వాటిని విస్మరించారా….

దేశంలో రైలు ప్రయాణాలు ప్రారంభమైనప్పటి నుంచి లోకోమోటివ్‌లో ఓ రక్షణ ఏర్పాటు ఉండేది. డీజిల్ లోకో (రైలింజన్) (Diesel Loco) , ఎలక్ట్రికల్ లోకో (Electrical loco) , DEMU,EMU, వాటి తాతలైన బొగ్గు ఇంజన్లు (steam Engines) .. ఇలా ఏ లోకో అయినా, అవి పుట్టినప్పటి నుంచి ఇంజిన్ అనే దానికి ఇవి తప్పనిసరిగా ఉండేవని చెబుతున్నారు. ఈ ఏర్పాటును రైల్ గార్డ్‌(RAILGUARD), కౌ క్యాచర్‌(CowCatcher), క్యాటిల్‌ గార్డ్‌ (cattleguard), లైఫ్‌ గార్డ్‌(lifeguard) అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. 19వ శతాబ్దం తొలినాళ్లలో చార్లెస్ బాబేజ్ వీటిని కనిపెట్టారు.

మన దేశంలో రైళ్లు పుట్టినప్పటి నుంచి, రైల్వే లైన్లు ఏర్పడినప్పటి నుంచి లోకో మోటివ్ తయారీలో ఇవి భాగం అయ్యాయి. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచి లోకోల తయారీలో ఈ పైలట్ ఏర్పాటు తప్పనిసరిగా ఉండేది. ఈ "పైలట్" ఏర్పాటు ఇంజిన్ లో భాగంగా ఉంటుంది. గాలిని చీల్చుకుని వెళ్లేలా కొనతేలిన "V" ఆకారంలో ఇంజిన్ కు రెండు వైపులా గార్డ్‌ విస్తరించి ఉంటుంది.

రైల్వే ట్రాక్ ల మీద, రైళ్లు వెళ్లేప్పుడు ఎవరు రాకుండా ఎలాంటి రక్షణ ఉండదు కాబట్టి, పట్టాల మీద వేగంగా వెళ్ళే రైలుకు ఏమి అడ్డం పడకుండా ఈ ఏర్పాటు 19వ శతాబ్దం తొలినాళ్ళలో మొదలైంది. ట్రాక్ మీదకు పశువులు, అడవుల్లో వన్య మృగాలు, కొండ ప్రాంతాల్లో రాళ్ళు పడితే వాటిని ఈ గార్డులు అడ్డుకుంటాయి. పట్టాల మీద ఉండే ఎలాంటి అడ్డంకులు అయినా వీటిని దాటుకుని మాత్రమే మిగిలిన రైలును చేరాల్సి ఉంటుంది. ఇంజిన్ రక్షణ వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అట. వీటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కనీసం తుప్పు కూడా పట్టనివ్వరు. లోకో షెడ్లలో వీటి నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

రైలు పట్టా మీద రెండు మూడు అంగుళాల ఎత్తులో ఉండేలా ఇంజిన్ కు అమరుస్తారు. ప్రత్యేకమైన ట్రాక్ కారిడార్లు ఉండే బులెట్ రైళ్లకు, మెట్రోలకు వీటి అవసరం ఉండదు. వాటి మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి ఈ అదనపు ఏర్పాటు చేయరు. బ్రాడ్ గేజ్ ట్రాక్ మీద వెళ్ళే ప్రతి రైలుకు వీటి అవసరం ఉంటుంది. ట్రాక్ మీదకు జనం, పశువులు రాకుండా కంచె వేయడం సాధ్యం కాబట్టి ఈ గార్డులు అవసరం. అడవుల్లో చెట్లు, రాళ్ళు పడితే వాటిని రైలు డీ కొడితే రైళ్ల కు ఘోర ప్రమాదాలు జరుగుతాయి. వేగంగా ప్రయాణించే రైళ్ళను వెంటనే ఆపలేరు కాబట్టి వీటిని బలమైన ఇనుముతో తయారు చేస్తారు.

రైలు ప్రయాణాలు మొదలైన తొలినాళ్లలో డ్రైవర్లు ఇంజిన్ చివరి భాగంలో ఉండేవారు. ఇంజిన్ ముందు పట్టాలపై ఏముందో వారికి కనిపంచే అవకాశం ఉండదు. పట్టాలపై ఉండే అడ్డంకులను నెట్టేయడానికి ఈ ఏర్పాటు చేసేవారు. ఆధునిక రైళ్లలో రకరకాల డిజైన్లలో వీటిని ఏర్పాటు చేస్తారని రైల్వే ఇంజనీర్లు చెబుతున్నారు. వందేభారత్ రైళ్లను వేగంగా ప్రయాణించేలా ఏరోడైనమిక్ డిజైన్‌లో తయారు చేసినా దేశీయ పరిస్థితులకు తగ్గట్లుగా రక్షణ ఏర్పాట్లు లేకపోవడం ఓ లోపమని ఓ రైల్వే ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. గ్లాస్‌ ఫైబర్‌తో ముందు భాగాన్ని తయారు చేయడంతో బలమైన వస్తువు తాకగానే అవి పగిలిపోతున్నాయని, ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న అన్ని రకాల లోకోలకు బయటి భాగం ధృడమైన ఇనుముతో తయారవుతాయని గుర్తు చేశారు.

Whats_app_banner