Case on KVR : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేసు నమోదు-case filed on komati reddy venkat reddy for threatening dr cheruku sudhakar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Case Filed On Komati Reddy Venkat Reddy For Threatening Dr Cheruku Sudhakar

Case on KVR : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 02:46 PM IST

Case on KVR : టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కి ఫోన్ చేసిన బెదిరించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. సుహాస్ చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ స్టేషన్ లో సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు

Case on KVR : కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. నల్గొండ వన్ టౌన్ స్టేషన్ లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కొడుకు సహాస్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో బెదిరించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

చెరుకు సుధాకర్ ని తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడు సుహాస్ కి ఫోన్ లో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో ... సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్ను కూడా చంపుతారని, నీ ఆసుపత్రిని కూడా కూల్చేస్తారని సుహాస్ ని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆడియోపై.. అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎంపీ వెంకట్ రెడ్డిపై... నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వారావుకు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు... ఈ వివాదం గాంధీభవన్ కు చేరింది. తనను, తన కుమారుడిని చంపుతానంటూ బెదిరించిన కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ టీపీసీసీ క్రమశిక్షణ చర్యల అమలు కమిటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను ఏనాడూ కోమటిరెడ్డిపై విమర్శలు చేయలేదని వెల్లడించారు. ఆయన తన గురించి మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. కేవీఆర్ మాటలు క్రిమినల్ ఆలోచనతోనే ఉన్నాయని చెప్పారు. తనకు కోమటిరెడ్డితో ఎలాంటి వైరమూలేదన్నారు. బీసీ నాయకుడిని చంపేస్తానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ అన్నారు. తాను ఉత్తమ్ ను ఏదో అన్నానని షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఇప్పుడు కోమటిరెడ్డికీ నోటీసులు ఇవ్వాల్సిందేనన్నారు.

భావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు...

చెరుకు సుధాకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన నేపథ్యంలో... ఈ వివాదంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవే గానీ వేరే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన ఆడియో క్లిప్ ని కట్ చేశారని.. కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారని వెల్లడించారు. చెరుకు సుధాకర్ పార్టీలో చేరినప్పటి నుంచి తనని తిడుతున్నారని.. అలా ఎందుకు మాట్లాడుతున్నారనే అడిగానని పేర్కొన్నారు. తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంటున్నారని.. ఈ విధంగా పదే పదే విమర్శలు చేయడం బాధించిందని చెప్పుకొచ్చారు. డాక్టర్ సుధాకర్ తనపై చేసిన విమర్శలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

IPL_Entry_Point