TS Politics : 'జిట్టా' చూపు హస్తం వైపు..! లైన్ క్లియర్ అయినట్టేనా..?
Telangana Assembly Elections 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నేత పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రేపోమాపో ఆయన హస్తం గూటికి చేరేలా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన కామెంట్సే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
BJP leader Jitta Balakrishna Reddy: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడ్డ కొద్ది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విభేదాల కారణంగా... ఈ మధ్యనే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి పార్టీని వీడారు. ఎంపీ కోమటిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన... కొద్ది నిమిషాల వ్యవధిలోనే కారెక్కారు. ఇదే టైంలో భువనగిరిలో పార్టీపరంగా తీసుకునే చర్యలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. అక్కడ బలమైన నేతగా పేరున్న జిట్టాపై కన్నేసింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జిట్టా... చాలా రోజులుగా యాక్టివ్ గా కనిపించటంలేదు. దీనికితోడు బీజేపీని ఉద్దేశిస్తూ... తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారటం పక్కాగానే అనిపిస్తోంది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన జిట్టా.... బీజేపీకి తాను మానసికంగా ఎప్పుడో దూరమయ్యాయని క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ లోకి రావాలంటూ తనకు ఆహ్వానం అందిందని కూడా చెప్పుకొచ్చారు. అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయనే బీజేపీలో చేరానన్న ఆయన... తాను కార్యకర్తగా మాత్రమే ఆ పార్టీలో ఉన్నానని కామెంట్స్ చేశారు. బీజేపీలోనే గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఎంపీ కోమటిరెడ్డిని అనే అంత స్థాయి అనిల్ కుమార్ రెడ్డికి లేదన్నారు. వీటన్నింటిని చూస్తే... జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
బలమైన నేతగా గుర్తింపు...!
భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పని చేసిన ఆయన... టీఆర్ఎస్ నుంచి రాజకీయంగా అవకాశాలు దక్కలేదు. కొన్నిసార్లు ఆ అవకాశం వచ్చినప్పటికీ... పొత్తుల కారణంగా దక్కలేదు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ , టీడీపీ పొత్తు పెట్టుకోవటంతో జిట్టాకు టికెట్ దక్కలేదు. ఈ టైంలోనే ఆయన పార్టీని వీడటమే కాదు... రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో నిలిచారు. స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేసి.... సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా... స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగారు జిట్టా బాలకృష్ణారెడ్డి. 39వేలకు పైగా ఓట్లు సాధించిన ఆయన... ఈసారి కూడా రెండో ప్లేస్ లో నిలిచారు. 15వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీని ప్రకటించారు జిట్టా. 2018 ఎన్నికల్లో పోటీ చేసి... కేవలం 13 వేల ఓట్లు సాధించి మూడో ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత పార్టీని బీజేపీలో విలీనం చేసి... కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.... తగిన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యనే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటంతో... జిట్టాను పార్టీలోకి తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది. ఫలితంగా కేడర్ లోకి ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఆయన చేరితే... అసెంబ్లీ బరిలో ఉంటారా..? లేక పార్లమెంట్ సీటుకు సంబంధించి ఏమైనా హామీ ఇస్తారా అనేది చూడాలి...!
సంబంధిత కథనం