Bandi Sanjay on KTR : డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ సవాల్ కి బండి సంజయ్ కౌంటర్-bandi sanjay counter attacks ktr on drugs test challenge ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Ktr : డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ సవాల్ కి బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay on KTR : డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ సవాల్ కి బండి సంజయ్ కౌంటర్

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 03:50 PM IST

Bandi Sanjay on KTR : డ్రగ్స్ టెస్ట్ అంశంలో కేటీఆర్ విసిరిన సవాల్ కి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ విచారణ ఏమైందని ప్రశ్నించారు.

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay on KTR : డ్రగ్స్ టెస్ట్ వ్యవహారంలో... అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళవారం రోజు మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కి .. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఏడాది క్రితం ఛాలెంజ్ చేస్తే.. ఇప్పుడు స్పందిస్తావా అని ప్రశ్నించారు. పరీక్షకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదని... ఎవరు ఆపారన్నారు. డ్రగ్స్ కేసులో దొరక్కుండా ఉండేందుకు వేరే దేశం వెళ్లి కేటీఆర్ 3 నెలల చికిత్స తీసుకున్నాడని సంజయ్ ఆరోపించారు. తీరిగ్గా ఇప్పుడు టెస్టుకి ఇస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. డ్రగ్ టెస్టుకి తాను సిద్ధమని.. పరీక్షలో తాను క్లీన్ గా బయటకి వస్తే .. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చెప్పు దెబ్బలకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్... బండి సంజయ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన సంజయ్... ఈ మేరకు కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాము మాట్లాడుతుంటే.. కేటీఆర్ ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. ఈ కేసుపై సిట్ చేత విచారణ జరిపించిన ప్రభుత్వం... ఇప్పటి వరకూ నివేదిక విడుదల చేయలేదని, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో ఇంత వరకూ ఎందుకు వెల్లడించలేదని కేటీఆర్ ని నిలదీశారు. కేసుకి సంబంధించి ఇతర దేశస్తులని అరెస్టు చేస్తున్న పోలీసులు... ఇక్కడి వారి పాత్రపై ఎందుకు విచారణ చేయడం లేదని అడిగారు. ఈ కేసుకి సంబంధించి విదేశీ లావాదేవీలు జరిగాయని చెప్పారు. తంబాకు, లవంగానికి తేడా తెలియని మూర్ఖుడు కేటీఆర్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను తినే లవంగాన్ని తంబాకుతో పోలుస్తున్నారని విమర్శించారు. అనుమానం ఉంటే పరీక్షకు రమ్మని పిలిచినా ఎందుకు స్పందించలేదని సంజయ్ ప్రశ్నించారు.

నిజమైన హిందువు అయితే... దక్షిణ కాశీగా చెప్పుకునే.. వేములవాడ గుడికి కేంద్రం నుంచి రూ. 500 కోట్లు ఇప్పించాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వేములవాడకు కేసీఆర్ ఇస్తానన్న రూ. 400 కోట్లు ఇంకా ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ధర్మపురి, కొండగట్టుకి రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని వాగ్దానం చేశారని.. అవి ఏమయ్యాయని నిలదీశారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసేందుకు సమ్మతిస్తూ అనుమతులు ఇచ్చిందని... రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 80 కోట్లు విడుదల చేయడం లేదని ఆరోపించారు. గంగాధర ఆర్ఓబీ పనులకు కూడా కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని.... ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు.

Whats_app_banner