Siricilla Powerlooms: సిరిసిల్ల కు పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేసి, యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని బండి విజ్ఞప్తి-bandi appeals to sanction power loom cluster to sirisilla and set up yarn depot ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siricilla Powerlooms: సిరిసిల్ల కు పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేసి, యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని బండి విజ్ఞప్తి

Siricilla Powerlooms: సిరిసిల్ల కు పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేసి, యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని బండి విజ్ఞప్తి

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 05, 2024 11:08 AM IST

Siricilla Powerlooms: సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముడిసరుకు యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేస్తూ లేఖను అందజేశారు.

కేంద్రమంత్రికి వినతి పత్రం అందిస్తున్న బండి సంజయ్
కేంద్రమంత్రికి వినతి పత్రం అందిస్తున్న బండి సంజయ్

Siricilla Powerlooms: సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేస్తూ లేఖను అందజేశారు.

ఢిల్లీలో బుధవారం కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను బండి సంజయ్ కలిసి వస్త్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేత కార్మికుల గురించి వివరించారు. ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని కోరారు.

సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేయడంవల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్న్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకీరణతో పాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

అట్లాగే యార్న్ డిపో ఏర్పాటువల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయన్నారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి....

బండి సంజయ్ విజ్ఝప్తిపట్ల జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80 శాతం సబ్సిడీ, పావులా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

డిల్లీ కి చేరిన సిరిసిల్ల సమస్య

గత కొంతకాలంగా సిరిసిల్లలో నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పని లేక చేసిన పని గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ గడిచిన రెండు మాసాల్లో ఎనిమిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేత కార్మికులకు బాసటగా ఉండాలని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావించి ఇటీవల సిరిసిల్లలో పర్యటించి వారికి బతుకు పై భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నేత కార్మికుల స్థితిగతులపై నివేదిక తయారుచేసి కేంద్ర జౌళి శాఖ మంత్రికి విన్నవించడంతో సానుకూల స్పందన లభించడం పట్ల సిరిసిల నేతకార్మికులు, పవర్ లూమ్ పరిశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)