Charminar : చార్మినార్ 444వ పుట్టిన రోజు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
హైదరాబాద్ అనే పేరు వినగానే అందరికీ మెుదట గుర్తొచ్చేది చార్మినార్. హైదరాబాద్ కు గుండె కాయ. చరిత్రకు సాక్ష్యం. అక్కడకు వెళ్లగానే.. తెలియకుండా ఓ అనుభూతిలోకి వెళ్తాం. అలాంటి చారిత్రక కట్టడం నిర్మించి 444 ఏళ్లు.
చార్మినార్.. ప్రపంచంలో ఇలాంటిది మరెక్కడా లేదు. భాగ్యనగరానికి వారసత్వ ఆస్తి. ఎన్ని విపత్తులు వచ్చినా.. చెక్కుచెదరకుండా వందల ఏళ్లు.. నిల్చొని.. హైదరాబాద్ అభివృద్ధిని నాలుగు మినార్లతో చూస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు.. తనముందే.. ఎదిగిన భాగ్యనగరాన్ని చూసి నవ్వుకుంటుందేమో చార్మినార్. అలాంటి చార్మినార్ నిర్మితమై.. 444 ఏళ్లు అవుతోంది. దానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీ కోసం..
చరిత్ర ప్రకారం.. హిజ్రీ క్యాలెండర్‌లోని 1.1.1000న మొదటి ముహర్రం నాడు.. చార్మినార్ ప్రజల కోసం తెరిచారు. అదే క్యాలెండర్ ప్రకారం హైదరాబాద్ నగరానికి పర్యాయపదంగా ఉన్న చారిత్రక కట్టడం నేటికి 444 ఏళ్లు పూర్తి చేసుకుంది.
శంకుస్థాపన చేసిన తేదీ, దానిని సామాన్యులు సందర్శించడానికి తెరిచిన తేదీ గురించి సందిగ్ధత ఉంది. అందుకే ప్రస్తుతానికి రెండు తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జూలై 31, జార్జియన్ క్యాలెండర్ ప్రకారం 1591లో అక్టోబర్ 9.
హిజ్రీ క్యాలెండర్ ప్రకారం చూస్తే.. జులై 31న చార్మినార్ బర్త్ డే అన్నమాట. ఏ క్యాలెండర్ అయితేనేం.. మన చరిత్ర గురించి చెప్పుకుంటే మంచిదే కదా. చార్మినార్ 444వ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
చార్మినార్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఆధ్వర్యంలో నిర్మించారు. ప్లేగు మహమ్మారి వచ్చి జనాలు అంతా అల్లకల్లోలం అయ్యారు. ఎంతో మంది చనిపోయారు. సాధారణ స్థితికి వచ్చిన సమయంలో గుర్తుగా చార్మినార్ నిర్మాణం జరిగింది.
నాలుగు టవర్ల కారణంగా దీనిని చార్మినార్ అని పిలుస్తారు. హిందీలో చార్ నాలుగు. మినార్ టవర్లు అంటారు.
చరిత్ర ప్రకారం.. చార్మినార్‌ను గోల్కొండకు కలిపే రహస్య సొరంగం ఉంది. అత్యవసరంగా వెళ్లడానికి అప్పటి పాలకుడు నిర్మించాడని చెబుతారు.
ఇది నగరం మధ్యలో ఉండేలా నిర్మించారు. తూర్పు-పశ్చిమ, ఉత్తరం-దక్షిణం వైపు రెండు రహదారులు ఇక్కడ ఒకదానితో ఒకటి కలుస్తాయి.
స్మారక చిహ్నం నాలుగు వైపులా ఉన్న గడియారాలు 1889 లో లండన్ నుండి తీసుకువచ్చారు. ఈ 150 సంవత్సరాల పురాతన గడియారాలు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో నగరానికి చేరుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొట్టమొదటి బహుళ అంతస్తుల భవనం చార్మినార్. భవనం తూర్పు వైపున ఉన్న తోరణాలలో ఒకదానిపై పిల్లి తల చెక్కబడి ఉంది. ఇది ప్లేగు వ్యాధిపై సాధించిన విజయానికి చిహ్నంగా నిర్మించారు. అందుకే.. ఎలుకలను పిల్లులు తిన్నాయని చెబుతోంది.
చార్మినార్ దగ్గరలో మక్కా మసీదు, భాగ్యలక్ష్మి దేవాలయం రెండూ ఒకే ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రదేశం మత సామరస్యాన్ని సూచిస్తుంది.
చార్మినార్ నిర్మాణంలో అడుగడునా నాలుగు దాగి ఉందనేది అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.
ప్రతీ మినార్‌లోనూ 140 మెట్లున్నాయి. ప్రతీ మినార్ అందమైన డోమ్ ఆకారంలో కనిపిస్తుంది. మెదటి, రెండో అంతస్తులలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడో అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. చార్మినార్ లో అడుగడుకూ ప్రత్యేకమే.