Adilabad Tribes Padayatra : ఆదిలాబాద్ టు ప్రగతి భవన్... ఆర్మూరులో ‘ఆదివాసీల పాదయాత్ర’ భగ్నం
Adilabad Tribes Padayatra : ఇళ్ల స్థలాలతో పాటు తమ సమస్యల పరిష్కారానికి మహాపాదయాత్రగా బయల్దేరిన ఆదివాసీలను అడ్డుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ నుంచి సుమారు 130 కి.మీ చేరుకున్న తర్వాత… పాదయాత్రను భగ్నం చేశారు. ప్రభుత్వ తీరుపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Adilabad Tribes Padayatra: ఒకప్పుడు జల్ జంగల్.. జల్ జమీన్ అనే నినాదం తో ముందుకు సాగారు ఆదివాసీలు.! దశాబ్ద కాలాలు దాటినా వారి దశ మారటం లేదనే అనిపిస్తోంది. రెక్కడితే గాని డొక్కాడదు అనే రీతిలోనే ఇంకా ఆదివాసీలు కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి, పోడు వ్యవసాయం చేసుకుంటే తప్పా పట్టాలు రాలేదు. ఎన్నో ఏళ్లుగా భూమి చదును చేసుకుని గుడిసెలు వేసుకున్నప్పటికి నేటికీ కనీస అవసరాలు తీరలేదు. నిజాం గుండెల్లో పరుగులు పెట్టించి స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన తుడుం దెబ్బ ఆదివాసీలు నేడు కనీస అవసరాలకు నోచుకోవడం లేరు.
ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర…
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల మండలంలోని బట్టిసావర్ గాం గ్రామ శివారులో సర్వే నెంబర్ 72లో కొమురం భీం కాలనిలో ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. సుమారు 1500 మంది ఆదివాసీలు గత కొన్నేళ్లుగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పట్టు బడుతున్నారు. ఎన్నో సార్లు మౌళిక వసతులు కల్పించి ఆడుకోవాలని కోరుతూ వస్తున్నారు. గృహ లక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండు చేయడం జరిగింది. వేసుకున్న గుడిసెలలో 9 ఆదివాసీ తెగలు వుంటున్నారు. వీరందరికి తెలంగాణ ప్రభుత్వం జీ వో నెంబర్ 58 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని వీరి ప్రధాన డిమాండ్.
ఆదివాసీలు తమ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నత అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ నుంచి ప్రగతి భవన్ కు సుమారు 500మంది పాదయాత్ర యాత్రగా బయల్దేరారు. తాగునీరు, కరెంట్, విద్యా, వైద్య, రోడ్డుసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో అదిలాబాద్ నుంచి ప్రగతిభవన్, రాజ్ భవన్ కార్యాలయాల వరకు పాదయాత్ర చేపట్టారు. సుమారు 130కిలోమీటర్లు సాగిన వీరి యాత్రలో అక్టోబరు 5వ తేదీన ఆర్మూర్ చేరుకుంది. అర్దరాత్రి 1గంటలకు పాదయాత్ర చేస్తున్నటువంటి తుడుం దెబ్బ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారు చేస్తున్న శాంతి యూత యాత్రను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు.
వెంటనే విడుదల చేయాలి..
గాంధీ జయంతి రోజున చేపట్టిన శాంతి యాత్ర వలన ఎవరికీ నష్టం కలుగచేయలేదని, హక్కుల కోసం, మా కష్టాలు తెలుపడం కోసం, అధికారులు స్పందించడం కోసం చేసే యాత్ర భగ్నం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీలు. పోలీసుల అరెస్టులను తుడుం దెబ్బ ఉట్నూర్ డివిజన్ కమిటీ ఖoడించింది . వెంటనే తమ నాయకులను విడుదల చేయాలనీ డిమాండ్ చేసింది. లేని పక్షాన తుడుందెబ్బ నాయకులు అందరు కలిసి జిల్లా, రాష్ట్ర వ్యాప్తoగా ఉద్యమం చచేపడుతామని డివిజన్ అధ్యక్షులు కొట్నాక్ భారీక్ రావ్ హెచ్చరించారు.