Tribal Unity : ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసులు, పోరాట స్ఫూర్తికి నిదర్శనం
Tribal Unity : ఆదివాసీలు పోరాటానికి వెనుకాడరు. అనుకుంటే సాధించే వరకు పోరాటం ఆపరు. ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసీలు. అందుకు నిదర్శనం ఇంద్రవెల్లి ఘటన. ఇప్పటీ ప్రభుత్వంతో అనేక విషయాల్లో ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
Tribal Unity : ఐకమత్యం అంటే తరుచు ఆదివాసులే గుర్తుకు వస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. వారు ఏదైనా అనుకుంటే నెరవేర్చుకునే వరకు పోరాటం ఆపరు, వారు వారి గ్రామ పెద్దల మాటలను తప్ప వేరే వారి మాటనే వినరు అని పేరు. ఆదివాసీలను ఒప్పించాలంటే చాలా చాలా కష్టతరం అని చెప్పుకుంటారు. ఒకసారి ఆదివాసీలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక ఆ పని పూర్తయ్యే వరకు వారి పోరాటం ఆగదని అధికారులు, రాజకీయ నాయకులు చర్చలు చేస్తుంటారు. నిత్యం కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని నింపుకుంటూ కొనసాగుతారు ఈ ఆదివాసీలు.
ఆదివాసీల పోరాట స్ఫూర్తికి ఇంద్రవెల్లి స్తూపం నిదర్శనం
జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసులు తమ హక్కుల కోసం ఇంద్రవెల్లిలో శాంతియుతంగా సమావేశం జరుపుతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆదివాసులు అమరులు కాగా, మరికొందరు రక్తపు మడుగులో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పుట్టకొకడు, గుట్టకొకడు వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ సంఘటనకు సరిగ్గా ఏప్రిల్ 20 నాటికి 43 ఏండ్లు అయ్యింది.
ఆదివాసి మహిళా... పోలీసు మధ్య జరిగిన పోరాటమే ఇంద్రవెల్లి స్తూపం ఆవిష్కరణ
ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న అప్పటి రైతు కూలీ సంఘం, పోర్క దొరలు (ప్రస్తుత పీపుల్స్ వార్) ఆదివాసులు ఎదుర్కొంటున్న భూసమస్యలు, అటవీ అధికారుల వేధింపులు, పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల మోసాలు తదితర సమస్యల పరిష్కారానికి ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజున వారాంతపు సంత కావడంతో జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇది గమనించిన పోలీసులు సమావేశానికి అనుమతి లేదంటూ వచ్చే ప్రజలను లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా సమావేశానికి వెళ్లే ఓ ఆదివాసీ మహిళకు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాట మంతి పెరగడంతో అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ తన చేతిలో ఉన్న కొడవలితో ఆ కానిస్టేబుల్ పొట్టలోకి కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే తన ప్రాణాన్ని వదలిపెట్టాడు.
దీంతో సమావేశంలో పోలీసులకు, ఆదివాసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి చెయ్యి దాటి పోవడంతో అప్పటి ఆర్డీఓ అంబారీష్ పోలీసులు కాల్పులకు అనుమతి నివ్వడంతో ఇంకేముంది పోలీసులు తమ తుపాకీ గుండ్లకు పనిపెట్టడంతో ఆదివాసులు పిట్టల్లా రాలిపోయారు. మరికొందరు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని నలు దిక్కుల్లా పరుగెత్తారు. ఈ సంఘటనలో కేవలం 11 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. కానీ ఆదివాసులు మాత్రం తమ వారు పదుల సంఖ్యలో తమ ప్రాణాలను అర్పించారని ఆదివాసులు పేర్కొంటున్నారు.
గతంలో అమరుల నివాళికి అనుమతి లేకుండే
ఆదివాసీలు స్మృతి చిహ్నంగా ఇంద్రవెల్లిలోని హీరాపూర్ లో వారి స్మారకార్ధం పీడబ్ల్యూజీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రతియేటా ఏప్రిల్ 20న అమరుల నివాళికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. పరిసర ప్రాంతం 5 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ విధించడంతో పాటు అటు ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి గుడిహత్నూర్ వరకు ప్రజలు రాకుండా గట్టి పోలీసు బందోబస్తు విధించేవారు. ఆ రోజున సంస్కరణ దినానికి అనుమతులు ఇచ్చేవారు కాదు.
ప్రత్యేక రాష్ట్రంలో ఆంక్షలకు సడలింపు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసులు బందోబస్తు మధ్య కొన్ని ఆంక్షలతో అమరవీరుల స్థూపం వద్దకు పూజలకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం అమరులైన కుటుంబీకులతో పాటు ఆదివాసీలు ఆచార సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వమే కట్టించిన స్తూపం
జల్ జంగల్ జమీన్ పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాటానికి మద్దతుగా ఇప్పటికి పోడు వ్యవసాయంపై దున్నే వాడిదే భూమి అన్నట్లుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు ఏజెన్సీ ఆదివాసీలు. తమ హక్కులు పూర్తిగా ఇవ్వకుండా ప్రభుత్వం అణచి వేస్తుందన్నట్లుగా ప్రశ్నిస్తూనే ఉంటారు. వీరి ఐకమత్యానికి ప్రతియేటా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణకు ఉదాహరణ. అదేవిధంగా ప్రభుత్వమే ఆదివాసుల ఒత్తిడికి దిగి వచ్చి ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన అరుదైన అమరుల స్తూపం కావడం విశేషం.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.