Nirmal District : ప్రేమ పేరుతో మోసం - మైనర్ బాలిక కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి నిర్మల్ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధింఛింది. ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.
బాలికను ప్రేమించానని, పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఒక యువకుడికి కోర్టు 20 సంవ త్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 1500 రూపాయల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన దుర్కే బాలాజీ అనే వ్యక్తి ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. శ్రీ సాయి ఇండస్ట్రీస్లో సిమెంట్ ఇటుకలను తయారు చేస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇక్కడే మధ్య ప్రదేశ్ కు చెందిన చాంద్ కుమార్ మరవి (20) అనే యువకుడు వీరితో కలిసి కూలీగా పని చేసేవాడు. అయితే చాంద్ కుమార్ లైంగిక వాంఛ తీర్చుకోవాలనే ఉద్దే శ్యంతో దుర్కే బాలాజీ కూతురిని ట్రాప్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పటంతో పాటు వివాహం చేసుకుంటానని నమ్మించాడు.
మాయ మాటలు చెప్పి లైంగికంగా లొంగదీసుకున్నాడు. తరువాత నిందితుడు పథకం ప్రకారం బాలికను కిడ్నాప్ చేసి… మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లి నిర్బందించి అనేకసార్లు లైంగికంగా వాడుకున్నాడు. బాలిక మోసపోయానని తల్లిదండ్రులకు తెలపడంతో బాలిక తండ్రి దుర్కే బాలాజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వాస్ రెడ్డి 15 మంది సాక్షులను కోర్టులో విచారించారు. బాలికను లైంగికంగా వేధించినట్లు కోర్టులో రుజువు అయింది. నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కర్ణ కుమార్… చాంద్ కుమార్ మరవికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 1500 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి. హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్