Women's Under 19 T20 World Cup: ఫైనల్లో ఇండియా.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు
Women's Under 19 T20 World Cup: అండర్ 19 వుమెన్స్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది ఇండియన్ టీమ్. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
Women's Under 19 T20 World Cup: సౌతాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023లో ఫైనల్ చేరింది ఇండియన్ టీమ్. శుక్రవారం (జనవరి 27) జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది.
ఇండియన్ బౌలర్లలో పర్షావి చోప్రా 3 వికెట్లతో రాణించింది. టైటస్ సాధు, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ సులువుగా ఛేదించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ (10) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ రాణించింది. ఆమె 45 బంతుల్లో 61 రన్స్ చేసింది. శ్వేత ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి.
దీంతో 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇండియన్ టీమ్ లక్ష్యాన్ని ఛేదించింది. అండర్ 19 మహిళలకు ఇదే తొలి వరల్డ్ కప్ కాగా.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇండియా నిలిచింది. మూడు వికెట్లు తీసుకున్న పర్షావి చోప్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.
జట్టుగా అందరూ తాము అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడటం సంతోషంగా ఉందని మ్యాచ్ తర్వాత కెప్టెన్ షెఫాలీ వర్మ చెప్పింది. ఫైనల్లో ఆడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆ మ్యాచ్ కోసం మొదట ప్లాన్ చేసి, తర్వాత శనివారం (జనవరి 28) తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలిపింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఇండియా తలపడనుంది.