Vinesh Phogat Silver Medal: వినేశ్ ఫోగాట్‌కు సిల్వర్ మెడల్‌పై ఆశలు.. గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్
Vinesh Phogat Silver Medal: వినేశ్ ఫోగాట్ విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) ఒక ప్రకటన విడుదల చేసింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోగా ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పడం గమనార్హం. దీంతో ఆమె సిల్వర్ మెడల్ పై మళ్లీ ఆశలు చిగురించాయి.
Vinesh Phogat Silver Medal: పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల విభాగంలో స్వర్ణ పతక పోరుకు ముందు వినేశ్ ఫోగాట్ పై విధించిన అనర్హత వేటుపై చేసిన అప్పీలును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ఆమోదించింది. అంతేకాదు శుక్రవారం (ఆగస్ట్ 9) దీనిపై అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. దీంతో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఒలింపిక్ రజత పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి.
ఒలింపిక్స్ ముగిసేలోగా నిర్ణయం
వినేశ్ ఫోగాట్ ఈసారి మెడల్ ఖాయం చేసిందని మురిసిపోయేలోపే ఫైనల్ కు ముందు ఆమె కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని తేలడంతో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఫైనల్ బౌట్ తలపడే అవకాశం రాలేదు. ఆమెకు ఎలాంటి మెడల్ కూడా దక్కలేదు.
అయితే దీనిపై వినేశ్ వెంటనే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)కు అప్పీల్ చేసింది. ఈ విజ్ఞప్తిని అంగీకరించి తదుపరి చర్యలను వివరిస్తూ సీఏఎస్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వర్ణ పతక పోరులో వినేశ్ అభ్యర్థనను తాము అంగీకరించలేమని సీఏఎస్ స్పష్టం చేసింది. అయితే ఆమెకు సంయుక్త రజత పతకాన్ని ప్రదానం చేసే అవకాశంపై కేసును విచారించేందుకు మాత్రం అంగీకరించింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై సీఏఎస్ తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఇదీ ప్రకటన
"ఒలింపిక్ గేమ్స్ పారిస్ 2024లో మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతక పోరుకు ముందు తనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) తీసుకున్న నిర్ణయానికి సంబంధించి భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (దరఖాస్తుదారు) 2024 ఆగస్టు 7న దరఖాస్తు దాఖలు చేశారు'' అని సీఏఎస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, ఫైనల్ బౌట్‌కు ముందు మరోసారి బరువు చూడాలని, ఫైనల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు ప్రకటించాలని సీఏఎస్ అడ్ హాక్ డివిజన్ ను వినేశ్ కోరింది.
ఫైనల్ బౌట్ లో తలపడే అవకాశం సీఏఎస్ ఇవ్వకపోయినా రజత పతకం ఇవ్వాలన్న అభ్యర్థనపై మాత్రం విచారణ జరుపుతోంది. దీనిపై ఆగస్ట్ 11లోగా తుది నిర్ణయం రానుంది. అదే రోజు పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఒకవేళ వినేశ్ కు అనుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం భారత్ ఖాతాలో మరో సిల్వర్ మెడల్ వచ్చి చేరుతుంది. అనర్హత వేటు వేయడంతో వినేశ్ మరుసటి రోజే రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కనీసం ఇప్పుడు సిల్వర్ మెడల్ వస్తే అయినా ఆమె కెరీర్ కు ఘనమైన ముగింపు లభించినట్లు అవుతుంది.