Suryakumar Golden Ducks: సూర్యకుమార్ 3 మ్యాచ్‌ల్లో 3 సార్లు డకౌట్.. ఈ ఘనత సాధించిన ఫస్ట్ బ్యాటర్
Suryakumar Golden Ducks: సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో గోల్డెన్ డకౌట్లలో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే డకౌటైన పస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
Suryakumar Golden Ducks: మొన్నటివరకు టీ20ల్లో ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో వచ్చేసరికి వరుసగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పొట్టి ఫార్మాట్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్.. 50 ఓవర్ల ఫార్మాట్‌కు వచ్చేసరికి విఫలమవడం టీమిండియా అభిమానుల్లో అసంతృప్తిని పెంచుతోంది. చెన్నై చెపాక్ వేదికగా బుధవారం నాడు జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆష్తన్ ఆగర్ వేసిన 36వ ఓవర్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల్లోనూ తొలి బంతికే గోల్డెన్ డకౌటై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వరుసగా మూడు వన్డేల్లోనూ తొలి బంతికే గోల్డెన్ డకౌటైన మొదటి భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూ ట్రాప్‌లో సూర్యకుమార్ ఇరుక్కోగా.. మూడో వన్డేలో మాత్రం ఆష్తన్ అగర్ స్పిన్ మాయాజలానికి పెవిలియన్ చేరాడు. వన్డేల్లో ఈ విధంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
సూర్యకుమార్ కంటే ముందు సచిన్ తెందూల్కర్(1994), అనిల్ కుంబ్లే(1996), జహీర్ ఖాన్(2003-04), ఇషాంత్ శర్మ(2010-11), జస్ప్రీత్ బుమ్రా(2017-2019) ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో సూర్యకుమార్ చేరాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక వరుస డకౌట్ల రికార్డు నాలుగు. అంటే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటై కొంతమంది ఆటగాళ్లు రికార్డు సృష్టించారు. లసిత్ మలింగ, క్రెయిగ్ వైట్, హెన్రీ ఒలోంగా తదితరులు ఈ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.
బుధవారం నాడు చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1-2 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కీలక భాగస్వామ్యాలను నిర్మించడంలో విఫలమైన భారత ఆటగాళ్లు చివరకు ఓటమిని చవిచూశారు. విరాట్ కోహ్లీ (54) అర్ధశతకంతో ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 4 వికెట్లతో రాణించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.