Ind vs SA: వరుసగా ఐదో టాస్ ఓడిన పంత్.. టీమిండియా బ్యాటింగ్
సౌతాఫ్రికా కెప్టెన్ మారినా టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ లక్కు మారలేదు. అతడు వరుసగా ఐదో టాస్ కూడా ఓడిపోయాడు.
బెంగళూరు: చివరిదైన ఐదో టీ20లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. నాలుగో టీ20లో గాయపడిన టెంబా బవుమా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతనితోపాటు మరో రెండు మార్పులు కూడా సౌతాఫ్రికా చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా కేశవ్ మహరాజ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ కు కూడా ఇండియా ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలించింది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే జరగనుందని పిచ్ రిపోర్ట్ సందర్భంగా దీప్‌దాస్ గుప్తా చెప్పాడు. అయితే పిచ్‌పై ఉన్న క్రాక్స్ సందర్భంగా స్పిన్నర్లకు కాస్త అనుకూలించవచ్చని అన్నాడు. ఈ గ్రౌండ్‌లో చేజింగ్ టీమ్స్ రాణించడంతో టాస్ కీలకమని తెలిపాడు.
ఐపీఎల్‌కు ముందు శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌లను టీమిండియా సులువుగా క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సౌతాఫ్రికా రూపంలో హోస్ట్ టీమ్‌కు కఠిన సవాలు ఎదురైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా.. తర్వాత కోలుకొని 2-2తో సమం చేయగలిగింది. దీంతో సిరీస్ ఎవరిదో తేల్చుకోవడానికి చివరి టీ20 వరకూ ఆగాల్సి వచ్చింది. గత రెండు మ్యాచ్‌లను చూస్తే టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2011 నుంచి ఇండియాలో ఒక్క పరిమిత ఓవర్ సిరీస్‌ను కూడా కోల్పోని సౌతాఫ్రికా.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.