South Africa vs Bangladesh: బంగ్లాదేశ్ బౌలర్లను చితకబాదిన రూసో, డికాక్.. సౌతాఫ్రికా భారీ స్కోరు
South Africa vs Bangladesh: బంగ్లాదేశ్ బౌలర్లను చితకబాదారు రూసో, డికాక్. రూసో సెంచరీ, డికాక్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఈ ఏడాది వరల్డ్ కప్ లో రూసోదే తొలి సెంచరీ కావడం విశేషం.
South Africa vs Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు రైలీ రూసో, క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రూసో సెంచరీ, డికాక్ హాఫ్ సెంచరీ చేయడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 రన్స్ చేసింది. రూసో 109, డికాక్ 63 రన్స్ చేశారు. తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరు సఫారీ బ్యాటర్లు కసిగా ఆడినట్లు కనిపించారు.
అయితే సౌతాఫ్రికా మరింత భారీ స్కోరు చేయాల్సి ఉన్నా.. డికాక్ ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు తడబడ్డారు. ఒక దశలో సౌతాఫ్రికా కనీసం 220 పరుగులైనా చేసేలా కనిపించినా.. చివరి ఐదు ఓవర్లలో కేవలం 29 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోవడంతో 205 స్కోరుతో సరిపెట్టుకుంది. స్టబ్స్, మార్‌క్రమ్, మిల్లర్ నిరాశపరిచారు.
వర్షం కారణంగా కాసేపు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే కెప్టెన్ బవుమా (2) ఔటైనా ఆ తర్వాతే అసలు విధ్వంసం ప్రారంభమైంది. అప్పటికే క్రీజులో ఉన్న డికాక్‌తో కలిసిన రూసో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరూ 5 ఓవర్లలోనే 60 రన్స్ జోడించిన సమయంలో కాసేపు వర్షం అడ్డుపడింది.
ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాగానే వీళ్లిద్దరూ అదే జోరు కొనసాగించారు. బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా రూసో సిక్స్‌ల మోత మోగించాడు. అతడు కేవలం 52 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ చేసిన తొలి సఫారీ బ్యాటర్‌గా నిలిచాడు. రూసో తన గత టీ20 ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. రూసో ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
మరోవైపు జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ చెలరేగిన డికాక్.. 38 బాల్స్‌లోనే 63 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 163 రన్స్ జోడించారు.