Siraj vs Litton Das: లిటన్‌ను ఆ మాట అన్నాను.. తర్వాతి బాల్‌కే ఔటయ్యాడు: సిరాజ్‌-siraj vs litton das in the first test between india and bangladesh as the duo exchange few words ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Siraj Vs Litton Das: లిటన్‌ను ఆ మాట అన్నాను.. తర్వాతి బాల్‌కే ఔటయ్యాడు: సిరాజ్‌

Siraj vs Litton Das: లిటన్‌ను ఆ మాట అన్నాను.. తర్వాతి బాల్‌కే ఔటయ్యాడు: సిరాజ్‌

Hari Prasad S HT Telugu
Dec 16, 2022 07:39 AM IST

Siraj vs Litton Das: లిటన్‌ను తాను ఏమన్నాడో వెల్లడించాడు టీమిండియా పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. అతనితో గొడవ పడిన తర్వాతి బంతికే లిటన్‌ ఔటవడం విశేషం.

సిరాజ్, లిటన్ దాస్ ల మధ్య మాటల యుద్ధం
సిరాజ్, లిటన్ దాస్ ల మధ్య మాటల యుద్ధం (Twitter)

Siraj vs Litton Das: మహ్మద్‌ సిరాజ్‌కు కాస్త దూకుడు ఎక్కువే. అతడు బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి వైపు సీరియస్‌గా చూడటం, ఏదో ఒక మాట అనడం తరచూ చూస్తూనే ఉంటాం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలోనూ ఆ టీమ్‌ బ్యాటర్‌ లిటన్ దాస్‌తో సిరాజ్‌ గొడవ పడ్డాడు. సిరాజ్‌ ఏమన్నాడో గానీ.. నాకు వినపడలేదు అన్నట్లుగా లిటన్‌ అతనిపైకి దూసుకొచ్చాడు.

దీంతో అంపైర్‌ అతన్ని అడ్డుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాతి బాల్‌కే లిటన్‌ ఔటయ్యాడు. ఈ వికెట్‌తో ఈ మాటల యుద్ధంలో చివరికి సిరాజే గెలిచినట్లు అయింది. సహనం కోల్పోయిన లిటన్‌.. తన వికెట్‌ పారేసుకున్నాడు. అయితే ఆ బాల్‌ వేయడానికి ముందు లిటన్‌తో జరిగిన గొడవ గురించి సిరాజ్‌ స్పందించాడు. అసలు అప్పుడు తాను లిటన్‌ను ఏమన్నాడో సిరాజ్‌ వివరించాడు.

సిరాజ్‌ వేసిన బాల్‌ను లిటన్‌ గల్లీ వైపు డిఫెన్స్‌ ఆడాడు. ఆ వెంటనే సిరాజ్‌ అతని వైపు వెళ్లి ఏదో అన్నాడు. దీనికి లిటన్‌ కూడా సీరియస్‌గానే స్పందించాడు. ఏమన్నావో నాకు సరిగా వినిపించ లేదు అన్నట్లుగా సైగ చేస్తూ సిరాజ్‌ వైపు దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న అంపైర్‌ లిటన్‌ను అడ్డుకోవాల్సి వచ్చింది. సిరాజ్‌ మళ్లీ బౌలింగ్‌ చేయడానికి వెనక్కి వెళ్లాడు.

ఆ తర్వాతి బాల్‌కే లిటన్‌ను సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో సిరాజ్‌ తన మార్క్‌ ‘ఫింగర్‌ ఆన్‌ ద లిప్స్‌'తో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ సమయంలో కోహ్లి కూడా అంతకు ముందు లిటన్‌ అన్నట్లుగా తనకు వినిపించ లేదు అన్నట్లుగా సైగ చేస్తూ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. అయితే అంతకుముందు ఉమేష్‌ బౌలింగ్‌లో లిటన్‌ ఒక ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, మరో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు.

దీనిని ఉద్దేశించి.. "ఇది టీ20 ఫార్మాట్‌ కాదు.. టెస్ట్‌ క్రికెట్‌.. కాస్త చూసి ఆడు" అని లిటన్‌తో అన్నట్లు సిరాజ్‌ చెప్పాడు. దీంతో లిటన్‌ మొదట సహనాన్ని, ఆ తర్వాత తన వికెట్‌ను కోల్పోయాడు. బంగ్లా టాపార్డర్‌ను సిరాజ్‌ కుప్పకూల్చాడు. అతడు ఓపెనర్లిద్దరితోపాటు కీలకమైన లిటన్‌ వికెట్‌ తీసుకున్నాడు. అతనికి కుల్దీప్‌ కూడా తోడై నాలుగు వికెట్లు తీయడంతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా టీమ్‌ 8 వికెట్లకు 133 రన్స్‌ మాత్రమే చేసింది.

WhatsApp channel