Shubman Gill Record: 24 ఏళ్ల కిందటి సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్-shubman gill breaks 24 year old sachin tendulkars record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shubman Gill Record: 24 ఏళ్ల కిందటి సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్

Shubman Gill Record: 24 ఏళ్ల కిందటి సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్

Hari Prasad S HT Telugu
Aug 23, 2022 09:08 AM IST

Shubman Gill Record: 24 ఏళ్ల కిందటి సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు శుభ్‌మన్‌ గిల్‌. జింబాబ్వేతో సోమవారం జరిగిన మూడో వన్డేలో అతడీ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్‌ గిల్‌
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్‌ గిల్‌

Shubman Gill Record: ఇండియన్‌ టీమ్‌ ప్లేయర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా టాప్‌ ఫామ్‌లో ఉన్న అతడు.. తాజాగా సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో ఏకంగా మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డునే బ్రేక్‌ చేశాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన గిల్‌.. ఆ సెంచరీతోనే రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ కేవలం 97 బాల్స్‌లోనే 130 రన్స్‌ చేశాడు. వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా గిల్‌ నిలిచాడు. 24 ఏళ్ల కిందట అంటే 1998లో సచిన్‌ టెండూల్కర్‌ బులవాయోలో 127 రన్స్‌ చేశాడు. ఇప్పటి వరకూ అతనిదే రికార్డు కాగా.. తాజాగా శుభ్‌మన్‌ గిల్‌ 130 రన్స్‌తో దానిని బ్రేక్‌ చేశాడు. తాజా మ్యాచ్‌ హరారెలో జరిగింది.

ఈ ఇద్దరి తర్వాత 2015లో అంబటి రాయుడు చేసిన 124 రన్స్‌ మూడోస్థానంలో ఉంది. ఆ తర్వాత మరోసారి 122 రన్స్‌తో సచినే నాలుగోస్థానంలో ఉండగా.. యువరాజ్‌ సింగ్‌ 120 రన్స్‌తో ఐదో ప్లేస్‌లో ఉన్నాడు. గిల్‌ ఈ సిరీస్‌లోనే కాదు.. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. చివరి ఐదు వన్డేల్లో అతని స్కోర్లు 64, 43, 98 నాటౌట్‌, 82 నాటౌట్‌, 33 కావడం విశేషం.

ఇంత ఫామ్‌లో ఉన్నా.. సెంచరీ చేయలేకపోతున్నానన్న లోటు గిల్‌కు ఉండేది. చివరి వన్డేలో ఆ లోటు కూడా తీరిపోయింది. నిజానికి వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనే సెంచరీ చేసేలా కనిపించినా.. వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో 98 రన్స్‌ దగ్గర ఆగిపోయాడు. ఇక జింబాబ్వేతో తొలి వన్డేలోనూ మూడంకెల స్కోరుకు దగ్గరగా వచ్చాడు. అయితే హోస్ట్‌ టీమ్‌ కేవలం 190 రన్స్‌ టార్గెట్‌ విధించడంతో ఈసారి గిల్‌ 82 రన్స్‌ దగ్గర ఆగాడు.

చివరి వన్డేలో మాత్రం టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయడంతో గిల్‌ ఇక ఆగలేకపోయాడు. రాహుల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్‌.. చివరి వరకూ క్రీజులోనే ఉన్నాడు. అతని దూకుడుతోనే ఇండియన్‌ టీమ్‌ 289 రన్స్‌ టార్గెట్ విధించగలిగింది. గిల్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఇక ఈ సెంచరీతో జింబాబ్వేపై సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయసు ఇండియన్‌గానూ గిల్‌ (22 ఏళ్ల 348 రోజులు) నిలిచాడు. ఈ లిస్ట్‌లో మహ్మద్‌ కైఫ్‌ (21 ఏళ్ల 287 రోజులు) టాప్‌లో ఉన్నాడు.

<p>సచిన్ ను మించిపోయిన గిల్</p>
సచిన్ ను మించిపోయిన గిల్
WhatsApp channel

సంబంధిత కథనం