Saina Nehwal Retirement: రిటైర్‌మెంట్‍పై సైనా నెహ్వాల్ కామెంట్స్.. అప్పుడే తీసుకుంటారు అంటూ!
Saina Nehwal About Retirement: భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణీల్లో ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఒకరు. కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో తనదైన శైలీతో సత్తా చాటిన సైనా నెహ్వాల్ తాజాగా తన రిటైర్‍మెంట్‍పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం అవుతోంది. 33 ఏళ్ల సైనా గత జూన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. దీంతో ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న సైనా నెహ్వాల్ ప్రస్తుతం 55వ ర్యాంక్‍కు పడిపోయింది. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు సైనా అర్హత సాధించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన రిటైర్‍మెంట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది సైనా నెహ్వాల్.
ఫలితాలు రావు
"గంట, రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే నా మోకాలుకు వాపు వస్తోంది. ప్రస్తుతం నేను మోకాలిని వంచలేకపోతున్నా. రెండో ట్రైనింగ్ సెషన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గరపడుతోంది. దానికి అర్హత సాధించడం కష్టమే. కానీ, నేను తిరిగి ఆడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. ఫిజియో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అయినా, వాపు తగ్గకపోతే మాత్రం కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో నేను ఆడలేను. ఆడిన ఫలితాలు కూడా బాగా రావు" అని సైనా మోకాలి నొప్పి గురించి తెలిపింది.
అప్పుడే రిటైర్‍మెంట్
సైనా ఇంకా కొనసాగిస్తూ.. "ఉన్నత స్థాయి ప్లేయర్లతో ఆడాలంటే కేవలం గంట ట్రైనింగ్ ఏమాత్రం సరిపోదు. మనం కూడా ఉన్నత స్థాయి ఆటను కలిగి ఉండాలి. మొదట నేను సమస్యను అధిగమించాలని అనుకుంటున్నా. శరీరాన్ని కాపాడుకోవడం, ఎలాంటి గాయాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శరీరం సపోర్ట్ చేయడం లేదని తెలుసుకున్న రోజున ప్రతి ఒక్కరూ రిటైర్‍మెంట్ తీసుకుంటారు. ప్రస్తుతానికి నేను తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఆటను ప్రేమిస్తున్నా. ఇంకా చాలా కాలం ఆడాలనుకుంటున్నా. అందుకే, ప్రయత్నించడం ఒక క్రీడాకారిణిగా నా బాధ్యత" అని సైనా వెల్లడించింది.
చివరిసారిగా
కోచింగ్ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, ఆడటం సులభమని, కోచింగ్ కష్టమైన పని అని తెలిపింది సైనా. ఆసియా గేమ్స్ లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ రాణిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసిన సైనా గాయం కారణంగా ఆసియా గేమ్స్ కు దూరంగా ఉంది. కాగా ఈ ఏడాది ఆడిన ఆరు టోర్నీల్లో మొదటి, రెండో రౌండ్లలోనే సైనా నిష్క్రమించింది. ఆమె చివరిసారిగా 2019 జనవరిలో ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ సాధించింది.