Malaysia Open 2023: కొనసాగుతున్న పరాజయాల పరంపర.. తొలి రౌండులోనే సైనా, శ్రీకాంత్ ఇంటిముఖం
Malaysia Open 2023: భారత షట్లర్ సైనా నెహ్వాల్, కిదాంబీ శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా మలేషియా ఓపెన్‌లో వీరిద్దరూ తమ తొలి రౌండులోనే ఓడి ఇంటిముఖం పట్టారు.
Malaysia Open 2023: భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వరుస పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం నాడు ఆరంభమైన మలేషియా ఓపెన్‌లో కామన్వెల్త్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సైనా.. మలేషియా ఓపెన్ తొలి రౌండులోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన హ్యాన్ యూ చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో తొలి రౌండులోనే ఇంటి ముఖం పట్టింది సైనా. ప్రపంచ 30 ర్యాంకర్ చేతిలో ఓడిపోయింది.
చైనా క్రీడాకారిణి చేతిలో 12-21, 21-17, 12-21 తేడాతో ఓటమి పాలైంది సైనా. తొలి సెట్‌లో ప్రత్యర్థి చేతిలో కంగు తిన్న సైనా.. రెండో సెట్‌లో మాత్రం పుంజుకుంది. ఆధిపత్యం చెలాయించి చివరకు ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 21-17తో గెలిచింది. ఇక మూడో సెట్‌లో మాత్రం చైనా షట్లర్ ధాటికి సైనా నిలువలేకపోయింది. ఆరంభం నుంచి అధిపత్యం చెలాయించిన ప్రత్యర్థి చివరకు గేమ్‌ను 12-21 తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు సెట్ల మ్యాచ్‌లో 1-2 తేడాతో సైనా పరాజయం పాలైంది.
మరోపక్క పురుషుల సింగిల్స్ విభాగం భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కూడా పరాజయం పాలయ్యాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన శ్రీకాంత్ జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో చేతిలో ఓడిపోయాడు. 19-21, 14-21 తేడాతో వరుస సెట్లలో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. కేవలం 42 నిమిషాల్లోనే ప్రత్యర్థి శ్రీకాంత్‍పై పై చేయి సాధించి మ్యాచ్ తన సొంతం చేసుకున్నాడు.
మొదటి గేమ్ ఇరువురి మధ్య హోరాహోరీగా సాగగా.. చివరకు విజయం మాత్రం జపాన్ ప్లేయర్‌నే వరించింది. చివరి వరకు పోరాడిన శ్రీకాంత్ తృటిలో గెలుపును దూరం చేసుకున్నాడు. అయితే తొలి సెట్‌లో పోరాడిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో మాత్రం చేతులు పైకెత్తేశాడు. 12-12తో స్కోర్లు ఇరువురి స్కోర్లు సమంగా ఉన్న సమయంలో జపాన్ షట్లర్ శ్రీకాంత్‌కు అవకాశమివ్వకుండా ఆధిపత్యం చెలాయించాడు. ఫలితంగా 14-21 తేడాతో శ్రీకాంత్ మ్యాచ్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ విభాగంలో మరో ప్లేయర్ ఆకార్షి కశ్యప్ కూడా 10-21, 8-21 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారిణి ఛీ సూ చేతిలో పరాజయం పాలైంది.
టాపిక్