Ravindra Jadeja: టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్లు.. రెండు పదాలతో ట్వీట్ చేసిన జడేజా
Ravindra Jadeja: 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. భారత్ ఆ టోర్నీ గెలిచి నేటికి పదేళ్లయింది
Ravindra Jadeja: భారత క్రికెట్ జట్టు చివరి ఐసీసీ ట్రోఫీని గెలిచి నేటికి (జూన్ 23) పదేళ్లయింది. 2013 చాంపియన్స్ ట్రోఫీనే టీమిండియా గెలిచిన చివరి ఐసీసీ టైటిల్. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆ చాంపియన్స్ ట్రోపీ విజేతగా నిలిచింది భారత్. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా టీమిండియాకు దక్కలేదు. ధోనీ సారథ్యంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‍తో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత చాలా ఐసీసీ టోర్నీలు జరిగినా భారత్ మాత్రం కప్ సాధించలేకపోయింది.
2013 చాంపియన్స్ ట్రోఫీలో బ్యాటింగ్‍లో శిఖర్ ధావన్, బౌలింగ్‍లో రవీంద్ర జడేజా అదరగొట్టారు. ఇంగ్లండ్ వేదికగా ఆ టోర్నీ జరిగింది. ఫైనల్‍లో వర్షం ఆటంకాలు కలిగించినా.. ఉత్కంఠ పోరులో ధోనీ సారథ్యంలోని భారత్ విజయం సాధించింది. కాగా, 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయానికి నేటికి పదేళ్లు పూర్తవటంతో టీమిండియా స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా.. దాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు.
2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తాను సాధించిన వ్యక్తిగత ట్రోఫీలతో ఉన్న ఓ ఫొటోను జడేజా పోస్ట్ చేశాడు. “గోల్డెన్ బాయ్" అంటూ క్యాప్షన్ పెట్టాడు. హ్యాష్ ట్యాగ్‍తో "మిషన్ కంప్లీటెడ్” అని రాసుకొచ్చాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు గాను జడేజాకు గోల్డెన్ బాల్ ట్రోఫీ దక్కింది. అలాగే ఇంగ్లండ్‍తో జరిగిన ఫైనల్‍లో బ్యాటింగ్‍లో, బౌలింగ్‍లో అదరగొట్టినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
వర్షం పడడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍ను 20 ఓవర్లకు కుదించారు అంపైర్లు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై చివర్లో జడేజా 25 బంతుల్లో 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఏడు వికెట్లకు 129 పరుగులు చేయగలిగింది. బౌలింగ్‍లోనూ రెండు వికెట్లు తీశాడు జడ్డూ. అశ్విన్, ఇషాంత్ కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‍ను 5 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో జడేజా మొత్తంగా 12 వికెట్లు తీశాడు.
2013 చాంపియన్స్ ట్రోఫీనే టీమిండియాకు చివరి ఐసీసీ టైటిల్‍గా ఉంది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో సెమీ ఫైనల్‍లో భారత పరాజయం పాలైంది. 2014 టీ20 ప్రపంచకప్‍లో ఫైనల్‍లో ఓటమి చెందింది. 2016, 2022 టీ20 వరల్డ్ కప్‍ల్లో సెమీ ఫైనల్‍లో నిష్క్రమించింది. 2021 టీ20 ప్రపంచకప్‍లో గ్రూప్ స్టేజీలోనే వైదొలిగి, నిరాశ పరిచింది.