Ravi Shastri on Jadeja incident: ఆస్ట్రేలియా టీమ్‌కు, రిఫరీకి లేని ప్రాబ్లెం మీకెందుకు?: రవిశాస్త్రి ఘాటు రిప్లై
Ravi Shastri on Jadeja incident: ఆస్ట్రేలియా టీమ్‌కు, రిఫరీకి లేని ప్రాబ్లెం మీకెందుకు అంటూ రవీంద్ర జడేజా ఆయింట్‌మెంట్ రాసుకున్న ఘటనపై రవిశాస్త్రి ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మీడియాకు అతడు దీటైన జవాబిచ్చాడు.
Ravi Shastri on Jadeja incident: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు రవీంద్ర జడేజా తన వేలికి ఏదో రాసుకున్నాడంటూ చెలరేగిన వివాదంపై మాజీ కోచ్ రవిశాస్త్రి చాలా ఘాటుగా స్పందించాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా టీమ్ కు, రిఫరీకి లేని సమస్య మిగతా వాళ్లకు ఎందుకు అని అతడు ప్రశ్నించడం గమనార్హం.
నిజానికి ఈ ఘటనపై ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంటే నేరుగా రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి వివరణ ఇచ్చింది. అది కేవలం ఆయింట్‌మెంట్ అని, నొప్పి నివారణ కోసం రాసుకున్నాడని చెప్పింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన రిఫరీ.. జడేజాకు, ఇండియాకు క్లీన్ చిట్ ఇచ్చాడు. అయినా దీనిపై వివాదం నడుస్తూనే ఉండటంపై రవిశాస్త్రి మండిపడ్డాడు.
రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు అతడు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. మైకేల్ వాన్, ఆస్ట్రేలియా మీడియా చేసిన ట్వీట్ల గురించి ప్రస్తావించినప్పుడు రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. "దాని గురించి నేను ఎక్కువగా వినలేదు. నేను రెండే ప్రశ్నలు అడిగాను. ఆస్ట్రేలియా టీమ్ తో ఏదైనా సమస్య ఉందా? దీనికి సమాధానం లేదు. మ్యాచ్ రిఫరీ సంగతేంటి? ఈ ఘటనపై రిఫరీకి వివరణ అందింది. స్పష్టత వచ్చింది.
దీంతో అది ముగిసిపోయింది. ఎవరి గురించో మనం ఎందుకు మాట్లాడుకోవాలి? నిజాయితీగా చెప్పాలంటే నొప్పి నివారణ కోసం ఆయింట్‌మెంట్ రాసుకోవడంపై మ్యాచ్ రిఫరీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, చర్య తీసుకోవాలన్న తీసుకునేవాడు. అయినా ఈ పిచ్ పై బాల్ దానికదే స్పిన్ అవుతుంది. దానికోసం ఏదో చేయాల్సి అవసరం లేదు" అని రవిశాస్త్రి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
తొలి రోజు ఆటలో సిరాజ్ నుంచి ఏదో తీసుకొని జడేజా తన వేలికి రాసుకుంటున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మీడియా ఏదో జరిగిందన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశాయి. దీనిపై ముందే ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ రిఫరీని కలిసి వివరణ ఇచ్చింది. దీనికి రిఫరీ కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు.
సంబంధిత కథనం