Virat Kohli: టీ20లు కాదు వన్డేలు, టెస్టులు ఆడు.. కోహ్లికి మాజీ పేస్‌బౌలర్ సూచన
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లికి ఎంతోమంది ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తాజాగా మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ కూడా అతడికి ఓ కీలకమైన సూచన ఇస్తున్నాడు.
న్యూఢిల్లీ: రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌తో తన ఫామ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ దగ్గర్లోనే ఉన్న సమయంలో అతని ఫామ్ లేమి టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతో మందిలాగే మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ కూడా కోహ్లికి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అయితే ఇంతవరకూ ఎవరూ చెప్పని ఓ ఆసక్తికరమైన పాయింట్‌ను కూడా ఆర్పీ సింగ్ లేవనెత్తాడు.
"అతని టైమ్ బాలేదు. అతడు ఔట్ అవుతున్న తీరు చాలా వింతగా ఉంది. విరాట్‌ను గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. విరాట్ చెత్త ఫామ్ చాలా రోజులుగా కొనసాగుతోంది. దీనిని నుంచి బయటకు రావాలంటే కూడా అంతే సమయం పడుతుంది. వన్డేలు, టెస్టులు అయితే ఎక్కువ బాల్స్ ఆడుతూ.. మెల్లగా ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. టీ20ల్లో ఆ స్వేచ్ఛ ఉండదు" అని ఆర్పీ అన్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కేవలం రెండే హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక్క ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఆర్సీబీని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఫామ్ లేమి ఆర్సీబీ అవకాశాలను దెబ్బతీసింది. అయితే చాలా మంది క్రికెటర్లు ఫామ్ కోల్పోయిన తర్వాత తిరిగి గాడిలో పడటానికి టైమ్ పట్టిందని, కోహ్లి కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆర్సీ సింగ్ చెబుతున్నాడు.
"ఫామ్‌లోకి రావాలని అనుకుంటే.. 50-55 బాల్స్‌లో 60 రన్స్ చేయడం మొదలుపెట్టాలి. అదే 55 బాల్స్‌లో సెంచరీ ఆశించలేం. క్రీజులో కాస్త సమయం గడిపి సింగిల్స్, డబుల్స్ తీయాలి. అతడు ఫామ్‌లోకి రావడం అంత సులువు కాదు. ఒకప్పుడు నేను డామినేట్ చేసేవాడిని.. ఇప్పుడు ఇలా ఔట్ అవుతున్నానేంటి అని విరాట్ అనుకుంటూ ఉండొచ్చు. అతడు సరైన పద్ధతిని ఎంచుకున్నాడు కానీ.. ఎంచుకున్న ఫార్మాట్ మాత్రం తప్పు" అని ఆర్సీ సింగ్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్